ప్రధాని మోదీకి కృతజ్ఞతలు : కేరళ సీఎం

తిరువనంతపురం : కేరళలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. రాష్ర్టానికి తక్షణ ఆర్థిక సాయం కింద రూ. 500 కోట్ల సహాయ నిధిని మోదీ ప్రకటించినట్లు చెప్పారు. తదుపరి అన్ని విధాలా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని మోదీ భరోసానిచ్చినట్లు సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నట్లు విజయన్ మీడియాకు తెలిపారు. మరిన్ని హెలికాప్టర్లు, బోట్లు సమకూర్చాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయలేకపోయామని పినరయి విజయన్ వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమవుతున్న కేరళ రాష్ర్టానికి.. బీహార్ ముఖ్యమంత్రి రూ. 10 కోట్లు, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రూ. 10 కోట్లు ప్రకటించారు. కేరళ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.25 కోట్ల తక్షణ సాయాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తనవంతు సాయంగా రూ.2 కోట్లను సీఎం సహాయనిధికి ఇవ్వనున్నట్లు తెలిపింది. కేరళలో అన్ని భారతీయ స్టేట్ బ్యాంకుల్లో నిర్వహిస్తున్న లావాదేవీలు, తదితర సేవలపై విధించే ఫీజుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.
× RELATED వంతెన పైనుంచి మహానదిలో పడ్డ బస్సు