పుర చట్టం భేష్

పౌర సేవలను సులభతరం చేయడం, అవినీతికి ఆస్కారం లేకుండా పాలన అందించడంతోపాటు పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సర్కారు రూపొందించిన కొత్త మున్సిపల్ చట్టం-2019పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా 75 గజాలలోపు నిర్మించుకునే ఇంటికి జీ 1 వరకు కేవలం ఒక రూపాయితో రిజిస్ట్రేషన్, 500 చదరపు మీటర్ల లోపు నిర్మాణాల కోసం కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే అనుమతి ఇస్తూ పలు మార్పులు చేయడం పట్టణ పేదలకు ఊరట కలిగించేలా ఉంది. అదే సమయంలో సెల్ఫ్ డిక్లరేషన్ తప్పుగా ఇస్తే 25 రెట్ల జరిమానా విధించడమే గాక, అక్రమంగా నిర్మిస్తే కఠినంగా వ్యవహరించనున్నది. చట్టాన్ని అతిక్రమించినా, విధులను నిర్లక్ష్యం చేసినా, సర్కారు ఆదేశాలు ఉల్లంఘించినా ప్రజాప్రతినిధులు, అధికారులను తొలగించేలా జిల్లా కలెక్టర్‌కు విశేష అధికారాలు కట్టబెట్టి, పారదర్శతకు పెద్దపీట వేసింది. ఫలితంగా బల్దియాల్లో సేవలు మెరుగుపడనుండగా, పట్టణవాసుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. (కార్పొరేషన్, నమస్తే తెలంగాణ):రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మున్సిపల్ చట్టం అవినీతిరహిత పాలన, ప్రజలకు మేలు చేసేలా ఉందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ ఈ చట్టం రూపకల్పన చేశారు. పట్టణవాసుల సేవే ధ్యేయంగా దూపుదిద్దుకున్న ఈ చట్టం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరనుంది. తద్వారా పట్టణ ప్రణాళిక, సిటిజన్ చార్ట్‌లో ఉన్న పౌర సేవలను పూర్తిగా చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 బిల్లును గురువారం సభలో ప్రవేశ పెట్టగా, శుక్రవారం దీనిని సభ ఆమోదించింది. గతంలో నాలుగు సంవత్సరాల్లోపు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉండేది కాదు. కొత్త చట్టంలో మూడేండ్లకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించింది. ఈ చట్టం ప్రకారం మున్సిపాలిటీల్లో ప్రభుత్వమే నేరుగా పనులు చేపట్టే అవకాశాన్ని కూడా ఈ చట్టం కల్పిస్తోంది. ప్రజలకు ఎంతో ముఖ్యమైన తాగునీరు, డ్రైనేజీ తదితర పనులు ప్రభుత్వం నేరుగా చేపట్టి ఆయా మున్సిపాలిటీలు నిధులు చెల్లించాలని ఆదేశించే అవకాశం ఉంటుంది. పట్టణాలు, పల్లెల్లోనూ గ్రీన్ కవర్ పాలసీ చేపట్టనున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీన్ కమిటీలు ఏర్పాటు చేస్తారు. బాధ్యతలు నిర్వర్తించని ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునేందుకు సైతం ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది. మరోవైపు కొత్త చట్టం ద్వారా అధికారులు, ఉద్యోగులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం ఉంటుంది. ఇక ఈ చట్టం ద్వారా కలెక్టర్లకు విశేషమైన అధికారులు కట్టబెట్టారు. రూపాయికే ఇంటి రిజిస్ట్రేషన్.. ఈ చట్టం ద్వారా ప్రజలు ముఖ్యంగా పేదవారికి ఎంతో మేలు చేకూరనుంది. గతంలో మున్సిపాలిటీల్లో ఇండ్లు కట్టుకోవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొనేది. దీనిని గమనించిన ముఖ్యమంత్రి చట్టాన్ని అనుసరించి 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం రూపాయిగా నిర్ణయించారు. జీ 1 వరకు రూపాయితో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 75 గజాల లోపు నిర్మించుకున్న ఇంటికి పన్ను రూ.100గా నిర్ణయించారు. ఇది పేదలకు ఎంతో మేలు జరగనుంది. కార్యాలయానికి రాకుండానే అంటే ఆన్‌లైన్ ద్వారా 500 చదరపు మీటర్ల వరకు నిర్మాణాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ 500 చదరపు మీటర్ల వరకు నిర్ణీత సమయంలో ఈ అనుమతి ఇవ్వనున్నారు. మరోవైపు ఇంటి యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించిన సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలని నిబంధన విధించారు. అదే సమయంలో ఇంటి కొలతలు, ఇతర తప్పుడు సమాచారం ఇస్తే భారీగా జరిమానాలు కూడా విధించనున్నారు. తప్పుగా సెల్ఫ్ సర్టిఫికేట్ ఇస్తే 25 రెట్ల జరిమానా విధిస్తారు. మరోవైపు అక్రమంగా నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారాలు కూడా ఈ చట్టం ద్వారా కల్పించారు. ఇక అన్నింటికీ బాస్ కలెక్టరే.. కలెక్టర్లకు ఈ చట్టం ద్వారా విశేషాధికారాలు కల్పించారు. మున్సిపాలిటీ తీర్మానాలను అమలు చేయడంలో, చట్టాన్ని అమలు చేసేందుకు కలెక్టర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించారు. కలెక్టర్ వారానికి మున్సిపాలిటీని తనిఖీ చేసి పనితీరును సమీక్షించాలి. కలెక్టర్లు వారి పరిధిలోని మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. అత్యవసర పనులు ఏమైనా ఉంటే వాటిని చేయాలని కలెక్టర్ ఆదేశించవచ్చు. నిధులు మాత్రం మున్సిపాలిటీలు మాత్రమే చెల్లించాలి. ఒకవేళ నిధులు చెల్లించకపోతే కలెక్టర్ మున్సిపాలిటీ కమిషనర్‌ను ఆదేశించే అవకాశం ఉంటుంది. కౌన్సిల్ తీర్మానాలను సస్పెండ్ చేసే అధికారం ఇప్పటికే ఉండగా, దానిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీలు చేసిన తీర్మానం లేదా జారీచేసిన లైసెన్స్, ఉత్తర్వులు అనుమతులను రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు కల్పించారు. చెర్‌పర్సన్ లేదా వైస్‌చైర్మన్‌ను ప్రభుత్వం లేదా కలెక్టర్ సస్పెండ్ చేసేందుకు కొత్త చట్టం అవకాశం కల్పిస్తోంది. చట్టం అతిక్రమణ, విధులు నిర్వహణలో విఫలం, ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘన ఇలాంటి సమయాల్లో వీరిని తొలగించేలా ఈ చట్టంలో పొందుపరిచారు. చెట్లు పెరగకపోతే ఉద్యోగం, పదవి పోతాయి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మున్సిపల్ బిల్లులో హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తెలంగాణలో హరితహారం పేరుతో పచ్చదనం పెంపొందించేందుకు కేసీఆర్ ఎన్నో రకాలైన వాటిని ఈ చట్టంలో ప్రత్యేక అంశాలను రూపొందించారు. పట్టణాలు, పల్లెల్లో గ్రీన్‌కవర్ పాలసీని ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీన్ కమిటీలు వేస్తారు. బడ్జెట్‌లో దీని కోసం పది శాతం నిధులు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. నర్సరీలు పెంచడం, మొక్కలు నాటడం చేపట్టేలా చర్యలు తీసుకుంటారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీ, జిల్లా అటవీ సంరక్షణ అధికారి లేదా అతని హోదాతో సమానమైన అటవీశాఖ అధికారితో కలిసి మున్సిపల్ కమిషనర్లు పచ్చదనం కోసం గ్రీన్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. 85 శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలి. హరితహారం లక్ష్యాలపై అశ్రద్ధ చేసే అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించనున్నారు. మొక్కలు నాటి సంరక్షించని ప్రజాప్రతినిధులపైనా చర్యలు తీసుకోనున్నారు. మొక్కలు నాటి సంరక్షించని సర్పంచ్, చైర్‌పర్సన్‌లను పదవుల నుంచి తొలగించనున్నారు.
More