ఐ లవ్ మై జాబ్

సమాజంలో అన్నింటికన్నా ఉపాధ్యాయ వృత్తి గొప్పది.. గౌరవప్రదమైనది.. క్రమశిక్షణ గల విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం.. ఓ మార్గదర్శిలా నిలుస్తూ చిన్నారుల భవితకు దశ దిశ చూపించే మహోన్నత వ్యక్తి.. అలాంటి ఉద్యోగంలో ఉన్న వారు తమ వృత్తి గౌరవాన్ని మరింత ప్రేరేపించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఐ లవ్ మై జాబ్ అనే అంశంపై ఉపాధ్యాయులకు వ్యాస రచన పోటీలను నిర్వహించి, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఎంపిక చేసి అవార్డులను అందిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. కరీంనగర్ ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ వృత్తి కేవలం వేతనాల కోసం కాదనీ, సామాజిక మార్పు, చైతన్యానికనే ఆలోచన ఉపాధ్యాయుల్లో వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ఉపాధ్యాయ వృత్తిని ఇష్టంగా చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. గతేడాది పదో తరగతి ఫలితాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ ఏడాది మంచి ఫలితాలను రాబట్టేలా ఉపాధ్యాయుల్లో ప్రేరణ కలిగించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర విద్యా శాఖ. పాఠశాల స్థాయి నుంచి నేను నా వృత్తిని ప్రేమిస్తున్నాను అంశంపై విస్తృతంగా చర్చ జరిగేలా చూడాలనే విద్యాశాఖ నిర్ణయం మేరకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖకు అనుబంధంగా, పాఠశాల్లో పనిచేస్తున్న వారందరినీ పోటీల్లో భాగస్వాములను చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా అన్ని భాషల్లోనూ వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ నెల 20న సన్మానం ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న గౌరవం, ప్రేమను రాసిపెట్టుకోవడమే కాక వారి అభిప్రాయాలతో పలువురిని ప్రభావితం చేసేలా అధికారులు గత నెలలో పాఠశాల నుంచి మండల, జిల్లాస్థాయి వరకు ఐ లవ్ మై జాబ్ అనే అంశంపై పోటీలను నిర్వహించారు. వీటిలో పాఠశాల, మండల, జిల్లాస్థాయిల్లో ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి రాష్ట్ర విద్యాశాఖకు పంపించారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ వ్యాసాలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఈ నెల 20న ఉత్తమ వ్యాసాలు రాసిన ఉపాధ్యాయులను రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డిల చేతుల మీదుగా సన్మానించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి ఎంపిక... ఐ లవ్ మై జాబ్ అనే అంశంపై నిర్వహించిన వ్యాస రచన పోటీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి నలుగురు ఎంపికవడం విశేషం. తెలుగు విభాగంలో కరీంనగర్‌లోని సమగ్ర శిక్ష అభియాన్‌లోని స్పెషల్ ఆఫీసర్ జోగినిపెల్లి అనురాధ ద్వితీయ స్థానంలో, కోరుట్ల జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయుడు మనోహరచారి తృతీయ స్థానంలో నిలిచారు. ఆంగ్ల విభాగంలో పెద్దపల్లి జడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయురాలు మైహముదా ఖాతూన్ తృతీయస్థానం, ఉర్దూ విభాగంలో హుజూరాబాద్‌లోని యూపీఎస్ ఉర్దూ మీడియం ఎస్జీటీ ఉపాధ్యాయురాలు సబహాత్ సమీరా ప్రథమ బహుమతికి ఎంపికయ్యారు. నేడు జిల్లాస్థాయి విజేతలకు సన్మానం ఐ లవ్ మై జాబ్ అనే వ్యాసాలకు జిల్లాస్థాయిలో వివిధ భాషల్లో విజేతలైన ఉపాధ్యాయులకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సన్మాన, అభినందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. తెలుగులో ప్రథమ బహుమతికి పరమేశ్వర్(జడ్పీహెచ్‌ఎస్, రుద్రారం), ద్వితీయ బహుమతికి రామచంద్రం(మానకొండూర్), తృతీయ బహుమతికి శ్రీధర్(అల్గునూర్) ఎంపికైనట్లు చెప్పారు. ఆంగ్ల విభాగంలో ప్రథమ బహుమతికి స్వప్న(జడ్పీహెచ్‌ఎస్, చెల్పూర్), ద్వితీయ బహుమతికి కృష్ణమొహన మూర్తి (జడ్పీహెచ్‌ఎస్, గర్షకుర్తి), తృతీయ బహుమతికి అర్చన ప్రియదర్శిని(మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మానకొండూర్) ఎంపికైనట్లు తెలిపారు. హిందీ విభాగంలో ప్రథమ బహుమతికి క్రాంతి (జడ్పీహెచ్‌ఎస్ చొప్పదండి), ద్వితీయకు ఇర్షాద్ (జడ్పీహెచ్‌ఎస్, గుండి) తృతీయకు ఉమాదేవి (జడ్పీహెచ్‌ఎస్, మన్నెంపల్లి) ఎంపికయ్యారని వెల్లడించారు. ఉర్దూ విభాగంలో ప్రథమ బహుమతికి సబిహా సమీర (యూపీఎస్, హుజూరాబాద్), ద్వితీయకు హసీమ హసీబ్ ఫాతిమా(జీపీఎస్ కశ్మీర్‌గడ్డ), తృతీయ బహుమతికి సాజీదా గౌహార్ (తిమ్మాపూర్) ఎంపికైనట్లు తెలిపారు.
More