జలసంరక్షణలో భాగస్వాములవ్వాలి

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):నీటి సంరక్షణ, నీటి నిర్వహణ జలశక్తి అభియాన్ పథకం ముఖ్య ఉద్దేశమనీ, ప్రజల భాగస్వామ్యంతోనే నీటి సంరక్షణ సాధ్యమవుతుందని జలశక్తి అభియాన్ కేంద్ర బృందం నోడల్ అధికారి ఎస్పీ సింగ్ పేర్కొన్నారు. గురువారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో జలశక్తి కేంద్ర బృందం సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూలై 1న జలశక్తి అభియాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రారంభించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలను 1600 బ్లాక్‌లుగా గుర్తించిందన్నారు. కరీంనగర్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి నీటి ఎద్దడి గల 5 బ్లాక్‌లు గన్నేరువరం, చిగురుమామిడి, రామడుగు, గంగాధర, చొప్పదండిగా గుర్తించారని తెలిపారు. జిల్లా యంత్రాంగంతో కలిసి 5 బ్లాక్‌లలో పర్యటించామనీ, ఆయా బ్లాక్‌లలో నీటి సంరక్షణకు జరుగుతున్న చెక్ డ్యాం నిర్మాణ పనులు, పాం ఫండ్‌లు, రీచార్జి బోర్‌వెల్స్, ఇంటింటికీ ఇంకుడు గుంత, మొక్కలు నాటే కార్యక్రమం పనులను పరిశీలించినట్లు తెలిపారు. నీటి సంరక్షణ, నీటి నిర్వహణ పనులపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. నీటి వనరులను సంరక్షించుట, ప్రతి వర్షపు నీటి బొట్టును భూమిలో ఇంకింపజేయడం, రీచార్జి బోర్‌వెల్స్ ద్వారా నీటిని నిల్వ చేసుకునే పనులపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. చెట్లు విరివిగా ఉంటే విస్తారంగా వర్షాలు కురుస్తాయనీ, ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని ఆయన సూచించారు. భావి తరాలకు నీటి కొరత రాకుండా నేటి నుంచే ముందు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. అన్ని గ్రామాల్లో నీటి సంరక్షణ ప్రణాళికలు తయారు చేసుకుని అమలు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జరుగుతున్న నీటి సంరక్షణ పనులను గ్రామాల్లో ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. నీటి సంరక్షణకు అవసరమయ్యే పంటలకు బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలనీ, ప్రపంచంలో 25 శాతం జనాభా నీటి కొరతతో జీవిస్తోందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణ పనులు చేపట్టి భూగర్భ జలాలు పెంచుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో జలశక్తి అభియాన్ కేంద్ర బృందం నోడల్ అధికారి, నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ ఉమ్రాసింగ్, టెక్నికల్ నోడల్ ఆఫీసర్ సెంట్రల్ వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ సౌరభ్‌శరణ్ మాట్లాడుతూ, రోజు రోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఏ వెంకటేశ్వర్‌రావు, భూగర్భ జలశాఖ ఉప సంచాలకుడు హరికుమార్, జిల్లా ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్‌రావుగుప్తా, సమాచార ఉప సంచాలకుడు పీ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
More