ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

హుజూరాబాద్ రూరల్: అధిక వడ్డీకి ఆశపడి ఫైనాన్స్ సంస్థలో డబ్బులు పెడితే నిర్వాహకులు శఠగోపం పెట్టడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హుజూరాబాద్ మండలం బోర్నపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన గంట శ్రీకాంత్(35) రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఇద్దరు ఫైనాన్స్ వ్యాపారుల వద్ద తన డబ్బులతో పాటు సమీప బంధువుల నుంచి తీసుకువచ్చి పెట్టాడు. అయితే సదరు ఫైనాన్స్ వ్యాపారులు సుమారు రూ. 3 కోట్లతో ఊడాయించారు. పైగా శ్రీకాంత్‌కు కోర్టు నుంచి ఐపీ నోటీసులు కూడా పంపించారు. అప్పటి నుంచి గ్రామానికి ఎప్పుడు వస్తారని ఎదురు చూడగా గత 6 నెలల క్రితం వచ్చారు. డబ్బులు ఇవ్వాలని పలుమార్లు అడుగగా నిర్వాహకులు స్పందించలేదు. ఈనెల 14న గ్రామ పెద్దల వద్దకు పిలిపించి అడుగగా డబ్బులు లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న శ్రీకాంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం భార్య, పిల్లలను పుట్టింటికి పంపించాడు. ఇంట్లో పురుగుల మందు తాగి, తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం శ్రీకాంత్ తండ్రి తలుపులు తీసి చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. హుజూరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజూరాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ మాధవి తెలిపారు. కాగా మృతుడికి కూతురు సిందూజ, కుమారుడు రిత్విక్ ఉన్నారు.
More