దిగ్విజయంగా జలయాత్ర

-జయహో కాళేశ్వర ఎత్తిపోతల పథకం -నిండుకుండలా గోదావరి -మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎదురెక్కుతున్న నదీ జలాలు -దాదాపూ 74 కిలోమీటర్లు ఎగువకు.. -అన్నారం పంప్‌హౌస్ హెడ్ రెగ్యులేటరీ గేట్లను ముద్దాడిన నీళ్లు -ఎత్తిపోతలకు శుక్రవారమే ముహూర్తం! -సిద్ధంగా నాలుగు మోటర్లు -ఇప్పటికే అన్ని పరీక్షలు పూర్తిచేసిన ఇంజినీరింగ్ అధికారులు -పరిశీలించిన ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, లిఫ్ట్ అడ్వయిజర్ పెంటారెడ్డి కాళేశ్వర జలయాత్ర దిగ్విజయంగా సాగుతున్నది. అద్వితీయ జలదృశ్యం ఆవిష్కృతమవుతున్నది. దిగువకు పారే గోదారమ్మ తన దిశను మార్చుకొని, మేడిగడ్డ నుంచి ఎదురెక్కుతున్నది. కన్నెపల్లి, అన్నారం మీదుగా సోమవారం కాసిపేటలోని అన్నారం పంప్‌హౌస్ హెడ్ రెగ్యులేటరీ గేట్లను ముద్దాడింది. ఒక్య బ్యారేజీ నుంచి మరో బ్యారేజీకి నీళ్లు చేరిన దృశ్యాన్ని చూసి ఇంజినీరింగ్ యంత్రాంగం సంబురపడింది. ఇప్పటికే అన్నారంలో అన్ని పరీక్షలు పూర్తి చేసి నాలుగు మోటర్లను సిద్ధంగా ఉంచగా, తాజాగా ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, లిఫ్ట్ అడ్వయిజర్ పెంటారెడ్డి సమీక్షించారు. ఏర్పాట్లను పరిశీలించి, ఎత్తిపోతలకు శుక్రవారం ముహూర్తం ఖరారు చేసి, అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంథని, నమస్తే తెలంగాణ/మంథని రూరల్ :కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రను తిరగరాస్తున్నది. పల్లెమెరిగి పరవళ్లు తొక్కే గోదారిని, దిశను మార్చి ఎగువకు తరలిస్తున్నది. మేడిగడ్డ నుంచి ఎదురెక్కి వస్తున్న గోదారమ్మ దిగ్విజయంగా సోమవారం మంథని మండలం కాసిపేట వద్ద నిర్మించిన అన్నారం పంపుహౌస్‌కు చేరువైంది. నాలుగు రోజులుగా కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజీలోకి ప్రవాహం పెరగడంతో అంతే వేగంతో తరలివస్తున్నది. - మంథని, నమస్తే తెలంగాణ/మంథని రూరల్ పూర్వ కరంనగర్ జిల్లా, ప్రస్తుత జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద ప్రాణహిత పరవళ్లు తొక్కుతున్నది. దీంతో మొత్తం 85 బ్యారేజీ గేట్లను మూసి, నీటిని నిల్వ చేస్తున్న అధికారులు, కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఐదు మోటర్ల ద్వారా నీటిని ఎగువకు అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోస్తున్నారు. ఇప్పటికే అన్నారం బ్యారేజీలోకి 4.7టీఎంసీల నీరు చేరగా, బ్యాక్ వాటర్ ఎదురెక్కుతున్నది. కాటారం మండలం దామెరకుంట, మంథని మండలం ఆరెంద, మల్లారం, ఖాన్‌సాయిపేట, ఖానాపూర్, మంథని, విలోచవరం, పోతారం, ఉప్పట్ల మీదుగా, దాదాపు మేడిగడ్డ నుంచి 74 కిలోమీటర్లు ఎగబాకింది. సోమవారం కాసిపేటలోని అన్నారం పంపుహౌస్‌కు హెడ్ రెగ్యులేటరీ గేట్లను తాకింది. తీర ప్రాంత ప్రజల్లో సంబురం గోదావరి ఎదురెక్కుతూ క్రమంగా ఎగువకు ఎక్కుతుండడంతో గోదావరి తీర గ్రామాల్లో జల సంబురం నెలకొంది. రోజుకు ఒక్క గ్రామాన్ని దాటి ఎదురెక్కివస్తున్న జలాలను చూసి గ్రామీణ ప్రజానీకం మురిసిపోతున్నది. ఇటు మంథని మండల గ్రామాలతోపాటు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల, నర్సపురం, ముత్తరావుపల్లె, పొక్కూరు, బీరెల్లి, ఒడ్డు సోమన్‌పల్లి, జైపూర్ మండలం పౌనూరు, శివ్వారం, వేలాల, కిష్టపూర్ గ్రామాల్లో ఎక్కడ చూసినా కాళేశ్వరం జలాలపైనే చర్చ సాగుతున్నది. పెద్ద సంఖ్యలో తరలివస్తూ గంగమ్మకు పూజలు చేస్తుండగా, ఇటు మత్స్యకారులు ఆనందపడుతున్నారు. కాగా, సోమవారం ఉప్పట్ల వద్ద ఎంపీటీసీ బడికెల దేవమ్మ ఆధ్వర్యంలో రైతులు నదీ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఉద్విగ్న వాతావరణం.. గోదారి ఎదురెక్కుతుండడంతో ఈ ప్రాంతంలో ఉద్విగ్న వాతావరణం కనిపిస్తున్నది. ఒక బ్యారేజీ నుంచి మరో పంప్‌హౌస్ దాకా గోదారి జలాలు ఎదురెక్కించే ప్రక్రియలో కీలక ఘట్టం ఆవిష్కృతంకావడంతో ఇంజినీరింగ్ యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎదురెక్కిన జలాలు ఒక్కో గ్రామాన్ని దాటుకుంటూ కాసిపేటను తాకిన నేపథ్యంలో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆదివారం పోతారం గ్రామాన్ని దాటాయనే సమాచారంతోనే అప్రమత్తమైన అధికారులు, పంప్‌హౌస్ వద్దే మకాం వేసి దాదాపు 24 గంటలుగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. ఒక్కసారిగా సోమవారం ఉదయం పంప్‌హౌస్‌ను చేరుకోగానే మన కృషి ఫలించిందని సంబురపడుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేయాలి : ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు.. గోదారి జలాలు అన్నారం పంప్‌హౌస్ తీరాన్ని తాకిన నేపథ్యంలో ఎగువకు ఎత్తిపోసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశించారు. సోమవారం అన్నారం పంపు హౌస్ హెడ్ రెగ్యులేటరీ వద్దకు వచ్చిన నీటిని పరిశీలించారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డితో కలిసి ఇరిగేషన్ ఇంజినీర్లు, మెగా కంపనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం వరకు నీటిని ఎత్తిపోసే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఆలోగా పంపుహౌస్, సుందిళ్ల బ్యారేజీకి సంబంధించిన అన్ని పరీక్షలను చేయాలని ఆదేశించారు. అంతకుముందు మంథని పుష్కర ఘాట్లను, ప్రమాదాలు జరగకుండా బిగిస్తున్న డైమండ్ మెష్‌ను పరిశీలించారు. అలాగే గోదావరిలో నీరు పెరుగుతుండడంతో తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట సుందిళ్ల బ్యారేజీ, గోలివాడ పంపు హౌజ్ ఈఈ బండ విష్ణుప్రసాద్, అన్నారం పంపు హౌజ్ డీఈ వల్లాల మధుసూధన్, మెగా పీఎం జనార్ధన్, ఏఈ రవీందర్ ఉన్నారు. మాకు ఎంతో మేలు.. ఇలా గోదావరి నీళ్లు ఎదురెక్కి రావడం ఆనందంగా ఉంది. ఇలా ఎప్పటికీ నీళ్లు ఉంటే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం శ్రమించి ఎన్నడూ ఎండిపోయి ఉండే ఈ గోదావరిని నిండుకుండలా మార్చారు. త్వరలోనే ఇక్కడి గ్రామాల్లో ఎన్నో మార్పులు వస్తయ్. -బడికెల దేవమ్మ, ఉప్పట్ల ఎంపీటీసీ (మంథని మండలం) మూడు పంటలు పండుతై.. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు వచ్చినై. ఇగ మాకు ప్రతీ ఏడూ మూడు పంటలు మస్తుగ పండుతై. మాకు నీళ్లకు ఢోకా ఉండదు. చాలా ఆనందంగా ఉంది. ఇలా నీళ్లను ఎదురెక్కి పారించడం ఎవ్వరి తరం కాదు. బాగ ముందు చూపు ఉన్న వ్యక్తి కేసీఆర్ అందుకే ఇట్లాంటి ప్రాజెక్టును కట్టిండు. - బడికెల సతీశ్, రైతు (ఉప్పట్ల) ఇదో అద్భుతం.. మీది నుంచి కిందికి నీళ్లు అచ్చుడు చూసినం. కానీ కాళేశ్వరం కాన్నించి ఇక్కడి దాకా మీదికి నీళ్లు ఎక్కుడంటే నిజంగా అద్భుతం. ప్రాజెక్టు కోసం నేను భూమి ఇచ్చిన. భూమి పోయినందుకు నాకు బాధ లేదు. ఇంత ప్రాజెక్టుకు భూమి ఇచ్చిన అనే సంతోషం ఉంది. ఈ నీళ్లను చూస్తే చాలా సంతోషంగా ఉంది. - నాంపల్లి దేవయ్య, రైతు (ఉప్పట్ల)
More