భూ సమస్య పరిష్కారానికి రైతుమాట

- మొదటి రోజు అనూహ్య స్పందన - 138 మంది రైతుల నుంచి ఫోన్లు - కరీంనగర్ డివిజన్ నుంచి అత్యధికం - సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన జేసీ శ్యాంప్రసాద్ లాల్ రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన రైతుమాట కార్యక్రమానికి మొదటి రోజు అనూహ్య స్పందన వచ్చింది. కలెక్టర్‌రేట్‌లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని సోమవారం జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ ప్రారంభించగా, 138 మంది రైతులు ఫోన్ చేసి తమ సమస్యలు తెలుపుకున్నారు. ముఖ్యంగా కరీంనగర్ డివిజన్ నుంచి అత్యధికంగా వినియోగించుకున్నారు. (కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):రైతుమాట సహాయక కేంద్రానికి మొదటి రోజు అనూహ్య స్పందన వచ్చింది. ఈ సహాయ కేంద్రానికి ఒకే రోజు 138 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇందులో కరీంనగర్ డివిజన్ నుంచి 110 కాల్స్ రాగా, హుజూరాబాద్ నుంచి 28 కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్ నుంచి అత్యధికంగా 26, గంగాధర నుంచి 14, మానకొండూర్ నుంచి 13, రామడుగు నుంచి 13, చొప్పదండి నుంచి మరో 13, తిమ్మాపూర్ నుంచి 12, చిగురుమామిడి నుంచి 9, జమ్మికుంట నుంచి 8, శంకరపట్నం నుంచి 8, వీణవంక నుంచి 7, కొత్తపల్తి నుంచి 6, గన్నేరువరం నుంచి 4, సైదాపూర్ నుంచి 3, హుజూరాబాద్ నుంచి 2 కాల్స్ వచ్చాయి. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు తాసిల్దార్ కేవీ మహేందర్‌తోపాటు ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు ఈ కాల్స్ రికార్డు చేశారు. వీటని సాయంత్రం 5 గంటల తర్వాత సంబంధిత తాసిల్ కార్యాలయాలకు మెయిల్ చేశారు. ప్రధానంగా ఐదు సమస్యలు రైతుమాట సహాయ కేంద్రానికి వచ్చిన ఫోన్ కాల్స్‌లో ప్రధానంగా ఐదు సమస్యలను అధికారులు గుర్తించారు. వీటిలో డిజిటల్ పట్టాదారు పాసు పుస్తకాలు రాలేదనీ, విస్తీర్ణం తక్కువ నమోదైందనీ, డిజిటల్ సిగ్నేచర్ కావడం లేదనీ, రైతుబంధు రావడం లేదనీ, సర్వే నంబర్లు తప్పిపోయాయనే ప్రశ్నలే ఎక్కువగా వచ్చినట్లు కేంద్రం ఇన్‌చార్జి కేవీ మహేందర్ తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ నమోదు చేసుకున్న అధికారులు ఇదే రోజు సంబంధిత తాసిల్ కార్యాలయాలకు పంపించారు. తాసిల్దార్లు వీటిని పరిశీలించిన తర్వాత 48 గంటల్లో పరిష్కరిస్తారు. కానట్లయితే ఎందుకు పరిష్కారం కావడం లేదో? ఇటు రైతుమాట సహాయ కేంద్రం నుంచి, అటు సంబంధిత తాసిల్ కార్యాలయం నుంచి రైతులకు తిరిగి ఫోన్ ద్వారానే తెలియజేస్తారు. దీంతో సమస్యల పరిష్కారానికి అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన జేసీ భూ సమస్యల తక్షణ పరిష్కారానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఏర్పాటు చేసిన రైతుమాట సహాయ కేంద్రాన్ని నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ సోమవారం కలెక్టరేట్‌లోని ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేశామనీ, 0878-2234731 నెంబర్‌కు ఫోన్ చేసి రైతులు తమ సమస్యలపై ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల పని రోజుల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతుమాట సహాయ కేంద్రం పని చేస్తుందని తెలిపారు. ఈ కేంద్రంలో ఒక తాసిల్దార్, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు అందుబాటులో ఉంటారనీ, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకుంటారని చెప్పారు. రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని, 48 గంటల్లోపు పరిష్కార వివరాలు తెలిపేలా ఈ కేంద్రం పని చేస్తుందన్నారు. రైతులందరికీ ధరణి పట్టాదారు పాసు పుస్తకాలు అమలయ్యేంత వరకు ఈ కేంద్రం పని చేస్తుందని చెప్పారు. రైతుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్ ఫిర్యాదులపై కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. తాను ఈ సహాయ కేంద్రానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ రైతుల సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వెంకటమాధవరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ ఆనంద్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్ రాంమనోహర్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్, ఉద్యానవనశాఖ ఉప సంచాలకులు శ్రీనివాస్, డీసీఓ మనోజ్‌కుమార్, మార్కెటింగ్ శాఖ డీడీ పద్మావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
More