రిజర్వేషన్లపై ఉత్కంఠ!

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీల్లో రాజకీయ సందడి మొదలైంది. ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతుండడంతో రిజర్వేషన్లపై ఔత్సాహికుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే నగరపాలక, పురపాలకల్లో డివిజన్లు, వార్డుల విభజన, ఓటర్ల జాబితాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల జాబితాలు కూడా విడుదల కావడంతో ఇక రిజర్వేషన్లపైనే అందరి దృష్టీ పడింది. ఏ డివిజన్ ఎలా రిజర్వేషన్ అవుతుందన్న సర్వత్రా ఆసక్తిగా మారింది. ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ సాగుతోంది. తమ డివిజన్‌లో ఏయే కుల ఓట్లు అధికంగా ఉన్నాయన్న విషయంలో నేతలు జోరుగా లెక్కలు వేయడం మొదలు పెట్టారు. మరోవైపు అధికారులు కూడా ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభించారు. రిజర్వేషన్లపై అంచనాలు జిల్లాలోని కరీంనగర్ నగరపాలక సంస్థతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఆశావహులు తమ డివిజన్లు, వార్డులు ఎలా రిజర్వ్ అవుతాయన్న విషయంలో చర్చలు సాగిస్తున్నారు. మరోవైపు బుధవారం అధికారులు విడుదల చేసిన ఓటరు జాబితాల్లో తప్పులపై నేతలు దృష్టి పెట్టారు. ఓటర్ల గల్లంతు, పక్క డివిజన్లు, వార్డుల్లోకి వెళ్లడంలాంటి వాటిపై దృష్టి పెట్టి అధికారులకు అభ్యంతరాలు అందిస్తున్నారు. కొందరు నాయకులు తమ డివిజన్లలోని ఆయా కుల ఓట్లను అనుసరించి తాము పోటీలో ఉండాలా?, వద్దా? అన్న విషయంలో అంచనాలు వేసుకుంటున్నారు. కాగా, ఈ నెల 14న ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకటించే అవకాశం ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. ముందస్తు ప్రచారాలు.. టిక్కెట్ల వేట కాగా, మరోవైపు ఆశావహులు ఇప్పటికే తమ తమ డివిజన్లు, వార్డుల్లో ముందస్తు ప్రచారాలు, పెద్ద మనుషులతో సమావేశాలు మొదలు పెడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఈ నెలలోనే ఎన్నికల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండడంతో ప్రచారం చేసుకునేందుకు ఎక్కువ సమయం ఉండదన్న ఆలోచనతో ఔత్సాహికులు ఇప్పటి నుంచే తమ ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు. ఇప్పటికే పలు డివిజన్లు, వార్డుల్లో దావతులు, సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న నాయకులు ఆయా పార్టీల నుంచి టిక్కెట్లు పొందేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయా పార్టీల అగ్రనేతలను, ప్రజాప్రతినిధులను కలుసుకొని తమకు ఈసారి టిక్కెట్టు కేటాయించాలంటూ కోరుతున్నారు. ఎవరికి వారుగా పార్టీ టిక్కెట్ల కోసం తమ వంతు ప్రయత్నాలను జోరుగా సాగిస్తున్నారు.

Related Stories: