కరీంనగర్‌లో ఒకేరోజు 54 ప్రసవాలు

కరీంనగర్ హెల్త్: కరీంనగర్ జిల్లాకేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో రోజురోజుకూ ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. శుక్రవారం ఒక్కరోజే 54 ప్రసవాలు జరిగాయి. ఇందులో 31 శస్త్ర చికిత్సలు కాగా, 23 సాధారణ ప్రసవాలు జరిగాయి. గతంలో ఒకేరోజు 44 ప్రసవాల రికార్డును తాజాగా అధిగమించింది. ఈనెల ఒకటి నుంచి 21 వరకు 617 ప్రసవాలు ఉన్నాయి. నెలాఖరు వరకు మరిన్ని డెలివరీలతో గతంలో ఉన్న రికార్డును అధిగమించే అవకాశం ఉన్నది. సిబ్బంది తక్కువగా ఉన్నా వైద్యాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సేవలందిస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది కొరత తీరితే ప్రసవాల సంఖ్య నెలకు వెయ్యికి చేరుకునే అవకాశం ఉందని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్‌కుమార్, ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీధర్, మాతా శిశు సంరక్షణ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ అలీం తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 24 గంటలపాటు వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతోనే రికార్డుస్థాయిలో ప్రసవాలు జరుగుతున్నాయని వారు వెల్లడించారు.