భూ సమస్యలు పరిష్కరించండి

-కరీంనగర్ జిల్లా ఆముదాలపల్లిలో వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతు -కరీంనగర్ తాసిల్‌లో మరో రైతు పురుగులమందు డబ్బాతో బైఠాయింపు -అధికారుల హామీతో శాంతించిన బాధితులు
శంకరపట్నం/కరీంనగర్ రూరల్: తమ భూసమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిన కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు చివరకు ఆత్మహత్యకు సిద్ధమయ్యారు. శంకరపట్నం మండలంలోని ఆముదాలపల్లిలో రైతు కొక్కిస పోచయ్య వాటర్ ట్యాంక్ ఎక్కగా, కరీంనగర్ తాసిల్ కార్యాలయంలో కరీంనగర్ రూరల్ మండ లం నగునూర్‌కు చెందిన తొంటి మహేందర్ పురుగులమందు డబ్బాతో బైఠాయించారు. శంకరపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన పోచయ్య కొన్నేండ్ల కింద తన తమ్ముడు కొక్కిస సమ్మయ్యతో కలిసి గ్రామ శివారులోని సర్వే నంబర్లు 55, 430, 449 లలో 3.23 ఎకరాల భూమి కొన్నారు. అప్ప ట్లో ఆర్వోఆర్ సైతం చేసుకోగా, అధికారులు 1-బీలో పేర్లు నమోదుచేశారు. అయితే ఆ భూమి ప్రస్తుతం వారి పేరిట ఆన్‌లైన్‌లో రావ డం లేదు. భూమిని ఆన్‌లైన్‌చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోక పోవడంతో ఓపిక నశించి గత నెల 14న తన కొడుకు స్వామితో వచ్చి తాసిల్ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్షకు సైతం దిగారు. న్యాయంచేస్తామని హామీ ఇచ్చిన రెవెన్యూ అధికారులు ఇప్పటికీ పట్టించుకోలేదు. మరోవైపు నీ వల్లే భూమి కొన్నా.. మన పేరిట అయితలేదు అంటూ అతని తమ్ముడు నిత్యం గొడవ పడుతుండటం, ఇటు అధికారులు పట్టించుకోక పోవడంతో ఆవేదనతో పోచయ్య శనివారం గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కారు. విష యం తెలుసుకొన్న సర్పంచ్, ఎంపీటీసీ సభ్యు డు, ఏఎస్సై ఘటనా స్థలానికి వెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు కిందకు దిగివచ్చారు.

1.29 ఎకరాలకు 18 గుంటలే నమోదు

కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్‌కు చెందిన తొంటి మహేందర్‌కు గ్రామంలోని పలు సర్వే నంబర్లలో వారసత్వంగా వచ్చిన 1.29 ఎకరాల భూమి ఉన్నది. అయితే భూరికార్డుల ప్రక్షాళనలో అధికారులు కొత్త పాస్‌పుస్తకంలో కేవలం 18 గుంటలే నమోదుచేశారు. మిగతా 51 గుంటలు నమోదుచేయాలని అధికారుల చుట్టూ నెలలతరబడి తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో శనివారం పురుగులమందు డబ్బాతో వచ్చి తాసిల్‌లో బైఠాయించారు. దీంతో కార్యాలయంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకున్నది. పురుగులమందు తాగేందుకు యత్నించగా, అధికారులు, సిబ్బంది అడ్డుకొన్నారు. ఇంచార్జి తాసిల్దార్ కనుకయ్య వద్దకు తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు మహేందర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Related Stories:

More