కంటివెలుగు @24 లక్షలు

-రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వైద్యశిబిరాలు -4,47,396 మందికి రీడింగ్ అద్దాల పంపిణీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నది. గతనెల ప్రారంభమైన కంటి వైద్యశిబిరాల నిర్వహణలో వైద్య బృందాలు నిమగ్నమై ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వైద్యశిబిరాలలో మంగళవారం నాటికి 23,94,555 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. కంటి వైద్యశిబిరాల్లో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. ప్రజల్లో నెలకొన్న ఆసక్తికి అనుగుణంగా వైద్య, ఆరో గ్య, కుటుంబసంక్షేమశాఖ పరిధిలోని సిబ్బంది, ఆశవర్కర్లు, వైద్య విభాగాలు శిబిరాలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమం ప్రారంభమైన నాటినుంచి మంగళవారం 18వ రోజుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కంటి వైద్యశిబిరాల్లో 23,94,555 మందికి కంటి పరీక్షలు చేయగా.. 4,47,396 మందికి రీడింగ్ అద్దాలు అందజేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 20 సర్కిళ్లలో బుధవారం 2964 మంది కంటివైద్య పరీక్షలు నిర్వహించినట్టు జీహెచ్‌ఎంసీ కన్వీనర్ దానకిశోర్ తెలిపారు. అందులో 600 మందికి కంటిఅద్దాలు పంపిణీచేయగా, 1385 మందికి శస్త్రచికిత్సల కోసం రెఫరల్ చేసినట్టు చెప్పారు.

చాలా సంతోషంగా ఉంది

సర్కారు డాక్టర్లు మా ఊరికే వచ్చి ఉచితంగా కంటిపరీక్షలు చేయడం సంతోషంగా ఉంది. పరీక్షలు చేయించుకున్న తర్వాత కండ్లద్దాలు ఇచ్చారు. నాతోపాటు మా కుటుంబసభ్యులకు పరీక్షలు చేయించిన . సీఎం కేసీఆర్ పేదల పాలిట దేవుడు. - భీంరావు, గుంజాల, భీంపూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా

వారంలోగా ఆపరేషన్ చేస్తమన్నరు

నాకు ఎడమ కన్ను ఆర్నెళ్ల నుంచి మస్క కనబడుతుందని చెప్పి కంటివెలుగులో డాక్టర్లకు చూపించుకొన్న. నా ఎడమ కంట్లో మోతిబిందు ముదిరిందని వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. నాకు ఆపరేషన్ చేస్తామని చెప్పిండ్రు. ఆపరేషన్ చేసేది ఫోన్‌చేసి చెప్తమని నంబర్ తీసుకున్నరు. వారంలోగా ఆపరేషన్‌కు తయారుండాలని చెప్పిండ్రు. -సురసాని నర్సవ్వ, నిజామాబాద్