జోరుగా కంటివెలుగు

-17 రోజుల్లో 22.13 లక్షల మందికి కంటిపరీక్షలు -4,26,577 మందికి కండ్లద్దాల పంపిణీ -సోమవారం 1,31,169 మందికి పరీక్షలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అంధత్వరహిత తెలంగాణ సాధనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ కంటివెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 17 రోజుల్లో 22,13,482 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా.. 4,26,577 మందికి కండ్లద్దాలను అందజేశారు. మరో 5,13,151 మందికి ప్రత్యేక అద్దాలను ప్రతిపాదించారు. ఇతర కంటివైద్యసేవలు, ఆపరేషన్ల కోసం 2,81,014 మందిని రిఫర్‌చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు పరీక్షలు చేయించుకున్నవారిలో 9,92,740 మందికి ఏవిధమైన కంటి సమస్యలులేవని తేలింది. 17వ రోజైన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,31,169 మందికి కంటిపరీక్షలు చేసి.. 5,763 మందికి కండ్లద్దాలను అందజేశారు. మరో 5,664 మందికి ప్రత్యేక అద్దాలను ప్రతిపాదించారు.

గ్రేటర్‌లో 31763 మందికి కంటిపరీక్షలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిళ్లలో సోమవారం 31,763 మందికి కంటిపరీక్షలు నిర్వహించిట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. ఇందులో 8,053 మందికి కండ్లద్దాలు పంపిణీచేయగా.. 2,827 మందిని శస్త్రచికిత్సలకు రిఫర్‌చేశారు. సోమవారం కమిషనర్ దానకిశోర్ అంబర్‌పేట్, గోల్నాక ప్రాంతాల్లోని కంటివైద్య శిబిరాలను సందర్శించి కంటిపరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు.

కండ్లద్దాలు ఇచ్చిండ్రు

ఏడాది నుంచి కండ్లు మస్కబారుతున్నాయి. కంటివెలుగు కేంద్రంలో చూపించుకున్న. నాకు దూరపుచూపు మందగించి మస్కబారుతున్నయని చెప్పి కండ్ల అద్దాలు ఇచ్చిండ్రు . అవి పెట్టుకొన్న సుంది కండ్లు తేజుగ కనబడుతున్నాయి. -మంగమ్మ, కోటగల్లి, నిజామాబాద్

ఎంతో సంతోషంగా ఉన్నది

ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేయడం, అద్దాలు ఇవ్వడం, ఆపరేషన్లు కూడా చేయించడం ఇంతకుముందు ఎన్నడూ లేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. నేను పరీక్షలు చేయించుకున్నా. మంచి అద్దాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ సారుకు వందనాలు. -ఎస్కే అబ్దుల్ అజీజ్, రిక్షాకాలనీ, ఆదిలాబాద్

మంచిగా కనిపిస్తున్నయ్

నేను మిషన్ కుడుతా. కొన్నేండ్ల నుంచి నాకు దగ్గరి చూపు తగ్గింది. ప్రైవేట్ దవాఖానకు పోతే అద్దాలు ఇచ్చిన్రు. అయినా మంచిగ కనిపిస్త లేవు. కంటివెలుగు శిబిరంలో డాక్టర్లు నా కండ్లను పరీక్షించి, చుక్కల మందులు, అద్దాలు ఇచ్చిన్రు. ఈ అద్దాలు పెట్టుకున్నంక దగ్గరున్న వస్తువులు మంచిగ కన్పిస్తున్నయ్. - తిరునగిరి వాణిశ్రీ, శర్మనగర్, కరీంనగర్