నిజాంసాగర్ కన్నా ముందటి చెరువు

-మినీ ట్యాంక్‌బండ్‌గా కామారెడ్డి పెద్ద చెరువు -మిషన్ కాకతీయతో మారిన దృశ్యం -సుందరంగా తీర్చిదిద్దుతున్న అధికారులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కామారెడ్డి పెద్ద చెరువుకు పన్నెండు దశాబ్దాల చరిత్ర ఉంది. కామారెడ్డి పట్టణానికి నైరుతిలో ఉన్న ఈ నీటి వనరు నిల్వ సామర్థ్యం 175 ఎంసీఎఫ్‌టీ. 68.97 చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతమున్న పెద్ద చెరువు బండ్ 1800 మీటర్ల మేరఉంది. దీనికింద 858 ఎకరాల ఆయకట్టు ఉంది. గత పాలకుల నిర్లక్ష్యంతో నామరూపాల్లేకుండా పోయిన పెద్దచెరువు.. మిషన్‌కాకతీయ పుణ్యమా అని సీఎం కేసీఆర్ చొరువతో మినీ ట్యాంక్‌బండ్‌గా రూపాంతరం చెందుతున్నది. ఈ చెరువు ప్రస్తుతం కామారెడ్డికి తాగునీటినందిస్తున్నది. రూ.8.96 కోట్ల వ్యయంతో బండ్‌ను బలోపేతం చేయడం, చెరువులో పూడికతీత, వెయిర్స్, స్లూయిస్‌లను అభివృద్ధి చేయడంతోపాటు వాకింగ్ ట్రాక్‌ను కూడా అభివృద్ధి చేశారు.

1897లో ఆరో నిజాం హయాంలో నిర్మాణం

1897లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ హయాంలో దోమకొండ సంస్థాన సంబంధీకులు రాజ మల్లారెడ్డి బహద్దూర్ దేశాయ్ ఈ చెరువును నిర్మించారు. ఇందుకు సంబంధించిన నాటి చారిత్రక రాతి శిలాఫలకం అలుగు పారే ప్రాంతంలో నేటికీ ఉర్దూ, తెలుగు భాషల్లో కనిపిస్తున్నది. కామారెడ్డి జిల్లాలోనే నిర్మితమైన చారిత్రాత్మక ప్రాజెక్టు నిజాంసాగర్ కన్నా ముందే ఈ చెరువును ఇక్కడ నిర్మించారంటే దీనికి ఉన్న విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. 18వ శతాబ్దం చివరలో ఈ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. నాడు అటవీ ప్రాంతంలో కురిసిన వర్షపు నీరు వాగులు, వంకల్లో కలిసి వృథాగా దిగువకు వెళ్లిపోతుండేది. అయితే కామారెడ్డి చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాల ప్రజలకు సాగు, తాగునీళ్ల ఇబ్బందులు ఎదురవడాన్ని గమనించిన నాటి నిజాం పాలకులు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు తటాకం తవ్వాలని నిర్ణయించారు. వరద ప్రవాహమార్గాన్ని అంచనావేసి, దానికి అడ్డంగా విశాలమైన ప్రాంతంలో భారీ ఆనకట్టతో పెద్ద చెరువును మూడు తూములతో అద్భుతంగా నిర్మించారు. పైగా, ట్యాంక్‌బండ్ లెవెల్‌ను 519.40 మీటర్ల స్థాయిలో నిర్ణయించారు. 516.82 మీటర్ల నీటిమట్టానికి మత్తడి దుంకేలా రాతితో అలుగును నిర్మించారు. ఇప్పటికీ ఆ అలుగు నిర్మాణం చెక్కు చెదరకుండా ఉన్నది.