ఈ మాయ పేరేమిటో గీతాలు

నేను సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో విజయ్ మాస్టర్‌గారు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పేవారు. ఎన్నో కొత్త విషయాల్ని నేర్పించారు. కష్టపడి జీవితంలో పైకొచ్చారాయన అన్నారు ఎన్టీఆర్. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ మాయ పేరేమిటో చిత్ర ఆడియో వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై చిత్ర గీతాల్ని విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. వి.ఎస్.వర్క్స్ పతాకంపై రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యా విజయ్ నిర్మించారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ సినిమాల్లో హీరోలు చేసే ఫైట్లకు మంచి ప్రశంసలొస్తాయి. కానీ వాటిని హీరోలతో చేయించే ఫైట్ మాస్టర్లను ఎవరూ పట్టించుకోరు. వారి శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలి.

విజయ్ మాస్టర్ తనయుడు కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. మంచి మనసున్న మనిషి ఎన్టీఆర్. నేను ఏం సాధించానో తెలియదు కానీ..ఎన్టీఆర్ ఈ ఫంక్షన్‌కి రావడం నేను సాధించిన విజయంగానే భావిస్తున్నాను. మా పిల్లలు పరిశ్రమలో ఇంతదూరం రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ఫైట్ మాస్టర్ విజయ్ తెలిపారు. రాహుల్ విజయ్ మాట్లాడుతూ భావోద్వేగాలతో సాగే చిత్రమిది. ప్రతి ఒక్కరూ ఏవో కొన్ని జ్ఞాపకాల్ని పోగుచేసుకొని ఇంటికి వెళతారు. ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం.

ఆయన అతిథిగా విచ్చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఎన్టీఆర్ అన్నయ్య ఈ ఆడియోను విడుదల చేయడం ఆనందంగా ఉంది. మా కుటుంబానికి ఎంతో ఇష్టమైన వ్యక్తి ఆయన. ఈ సినిమాకు మణిశర్మగారు అద్భుతమైన సంగీతాన్నందించారు. పాటలు అందరికి నచ్చుతాయి అని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. రాజేంద్రప్రసాద్, పోసాని, పవిత్రలోకేష్, మురళీశర్మ వంటి సీనియర్ నటులు మంచి పాత్రలు చేశారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూరి జగన్నాథ్, రామ్‌లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

× RELATED వెంకీ అట్లూరి దర్శకత్వంలో..?