కాళోజీ ఆశయ సాధనకు కృషి

-ప్రజాకవి జయంతి వేడుకల్లో ప్రముఖులు -హన్మకొండలో ఘనంగా నివాళి
వరంగల్ కల్చరల్: ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు 104వ జయంతి వేడుకలను ఆదివారం వరంగల్‌లో ఘనంగా నిర్వహించారు. హన్మకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహానికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రతినబూనారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్.. కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ ఫౌండేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి అశోక్‌కుమార్, కాళోజీ కుమారుడు రవికుమార్, తెలంగాణ భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు తిరువరంగం ప్రభాకర్, తెలంగాణ రచయితల సంఘం (తెరసం) జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్, దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ వ్యవస్థ్థాపకుడు అస్నాల శ్రీను, సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, టీఎన్జీవోస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, కార్పొరేటర్లు స్వరూప, శ్రీనివాస్, రంజిత్‌రావు పాల్గొన్నారు.

జూపాక సుభద్రకు ఈ ఏటి కాళోజీ పురస్కారం

ప్రజాకవి కాళోజీ పురస్కారం-2018ను ప్రముఖ సామాజిక కవయిత్రి జూపాక సుభద్రకు అందజేయనున్నట్టు కాళోజీ ఫౌండేషన్ కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాసరావు, కోశాధికారి అశోక్‌కుమార్ తెలిపారు. నవంబర్ 13న పురస్కారగ్రహీతకు రూ.10,116, జ్ఞాపిక అందజేస్తామని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దామరంచపల్లెకు చెందిన సుభద్ర తెలంగాణ సచివాలయంలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె అనేక కవితలు, కథా సంపుటాలు, వ్యాసాలు రాశారు. అణగారినవర్గాల ప్రజల కోసం ఉద్యమిస్తున్నారు.