కాళోజీ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం

-టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ -బస్‌భవన్‌లో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
హైదరాబాద్ సిటీబ్యూరో, హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాళోజీ ఉద్యమ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయమని.. తెలంగాణ భాషకు, యాసకు అక్షరాలు అద్దిన మహాకవి అని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కొనియాడారు. ప్రజాఉద్యమాలే ఊపిరిగా తనజీవితాన్ని సమాజసేవకు అంకితం చేశారన్నారు. తన పార్థివదేహాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు దానంచేసిన గొప్పవ్యక్తి అని పేర్కొన్నారు. బస్‌భవన్‌లో కాళోజీ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కాళోజీతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు పురుషోత్తంనాయక్, రవీందర్, శివకుమార్, కొమురయ్య, వినోద్ పాల్గొన్నారు.

పోలీస్‌అకాడమీలో ఘనంగా కాళోజీ జయంతి

కాళోజీ నారాయణరావు 104వ జయంతి వేడుకలను రాష్ట్రపోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో సెమినార్‌హాల్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అకాడమీ అడిషనల్ డైరెక్టర్ టీవీ శశిధర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ బీ నవీన్‌కుమార్, జాయింట్ డైరెక్టర్ రాఘవరావు, అడిషనల్ డైరెక్టర్లు రవీందర్‌రెడ్డి, ఎన్వీఎస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.