ర‌జ‌నీ విజ్ఞ‌ప్తి చేసినా ఆగ‌ని ఆందోళ‌న‌లు

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన కాలా చిత్రం మ‌రి కొద్ది గంట‌లలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. అయితే క‌ర్ణాట‌క‌లో మాత్రం సినిమా విడుద‌ల‌య్యేలా ఏ మాత్రం క‌నిపించ‌డం లేదు. ఈ రోజు ఉద‌యం మొద‌లు కావ‌లసిన బెనిఫిట్ షోస్‌ని అడ్డుకునేందుకు బెంగ‌ళూరులో క‌న్న‌డిగులు గ్రూపులుగా ఏర్పడి థియేట‌ర్స్ వ‌ద్ద‌కు చేరి సినిమా రిలీజ్ కాకుండా అడ్డుప‌డుతున్నారు. మ‌మ్మ‌ల్ని వ్య‌తిరేకించి సినిమాని ప్ర‌ద‌ర్శిస్తే మాత్రం విధ్వంసం సృష్టిస్తామ‌ని వారు డిమాండ్ చేయ‌డంతో థియేట‌ర్ యాజ‌మాన్యాలు కూడా సినిమాని ప్ర‌ద‌ర్శించేందుకు జంకుతున్న‌ట్టు తెలుస్తుంది. థియేట‌ర్స్ ద‌గ్గ‌ర కొంత భ‌ద్ర‌త ఏర్పాటు చేసిన‌ప్ప‌టికి ప్ర‌భుత్వం నుండి సినిమా రిలీజ్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో అభిమానులు అయోమ‌యంలో ఉన్నారు.

కాగా, ర‌జ‌నీకాంత్ నిన్న సాయంత్రం చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని నివాసం వద్ద మీడియా సమావేశంలో కన్నడలో అర్థించారు. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరి యాజమాన్య బోర్డు నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని మాత్రమే నేను కర్ణాటక ప్రభుత్వాన్ని కోరాన‌ని అన్నారు. కన్నడిగుల ప్రయోజనాలను, వారి మ‌నోభావాల‌ని దెబ్బతీయడం త‌న ఉద్దేశం కానేకాదు అని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సినిమా విడుదల ప్రశాంతంగా జరిగేలా సీఎం కుమారస్వామి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా అని అన్నారు. ప్ర‌పంచ‌మంత‌టా విడుద‌ల అవుతున్న కాలా సినిమాపై కేవ‌లం క‌ర్ణాట‌క‌లో వివ‌క్ష చూపెట్టొద్దంటూ ఆయ‌న క‌న్న‌డిగుల‌ని కోరిన సంగ‌తి తెలిసిందే. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన కాలా చిత్రాన్ని ధ‌నుష్ వండ‌ర్ బార్ ఫిలింస్ బేన‌ర్‌పై నిర్మించిన సంగ‌తి తెలిసిందే .

× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు