భారత్‌కు పతక నిరాశ

చాంగ్వాన్(దక్షిణకొరియా): షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్‌కు నిరాశజనక ఫలితాలు ఎదురయ్యాయి. పోటీలకు తొమ్మిదో రోజైన సోమవారం జరిగిన పురుషుల జూనియర్ స్కీట్ టీమ్ ఈవెంటు అర్హతలో టాప్‌లో నిలిచినా..పతకం సాధించలేకపోవడంతో పాటు ఒలింపిక్స్ కోటా దక్కించుకోలేకపోయింది. గుర్నెల్‌సింగ్(73), అనంత్‌జీత్‌సింగ్(71), ఆయూష్ రుద్రరాజ్(70) 214 పాయింట్లతో సైప్రస్ జట్టును అధిగమిస్తూ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. మంగళవారం వ్యక్తిగత విభాగంలో రెండు అర్హత రౌండ్ పోటీలకు జరుగనున్నాయి. మరోవైపు పురుషుల 25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంటులో అనీశ్ భన్వాలా మూడు పాయింట్లతో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. జూనియర్ పురుషుల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌లో ఐశ్వర్య ప్రతాప్‌సింగ్ 1155 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు. ఓవరాల్‌గా భారత్ ప్రస్తుతం ఏడు స్వర్ణాలతో సహా 20 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నది.