జర్నలిస్టులు ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలి

-నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి -నీటి విలువ తెలిసిన నాయకత్వం అవసరం: నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి
రామగిరి: ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి.. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లేలా జర్నలిస్టులు వారధుల్లా పనిచేయాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నల్లగొండ పోలీసు ఆడిటోరియంలో జరుగుతున్న జర్నలిస్టుల శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారని తెలిపారు. అంతకుముందు నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి నదులు, జలసంపద- తెలంగాణ ప్రాజెక్టులు అనే అంశంపై జర్నలిస్టులకు అవగాహన కల్పించారు. నదులు, నీటి నిల్వలు తదితర అంశాలను లెక్కలతో సహా వివరించారు. ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్యాయాలను కండ్లకు కట్టారు. గత పాలకులకు నీటిసోయి లేకపోవడం వల్లే నల్లగొండ గొంతెండుకుపోయిందని పేర్కొన్నారు. నీటివిలువ తెలిసిన నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, కార్యదర్శి రాజమౌళి, మేనేజర్ లక్ష్మణ్, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు బుచ్చన్న, టీయూడబ్ల్యూజే (హెచ్143) రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్, యూసుఫ్‌బాబా, రియాజుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.