ఒమన్ రచయిత్రికి మ్యాన్ బుకర్ ప్రైజ్

- అవార్డుకు ఎంపికైన తొలి అరబిక్ రచయిత్రిగా ఝోకా అల్హార్థి ఘనత లండన్: ప్రతిష్ఠాత్మక సాహితీ అవార్డు మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్‌కు 2019 ఏడాదికి ఒమన్‌కు చెందిన ఝోఖా అల్హార్థి ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి అరబిక్ రచయితగా ఆమె నిలిచారు. సెలెస్టియల్ బాడీస్ నవలకుగాను ఆమెకు ఈ అవార్డు వరించింది. మంగళవారం లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు అవార్డును అందజేశారు. అనంతరం అల్హార్థి మాట్లాడుతూ.. విశిష్ట అరబిక్ సంస్కృతికి ద్వారాలు తెరిచినందుకు థ్రిల్లింగ్‌గా ఉందని వ్యాఖ్యానించారు.ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో క్లాసికల్ అరబిక్ పొయెట్రీని అభ్యసించిన అల్హార్థి.. ప్రస్తుతం మస్కట్‌లోని సుల్తాన్ ఖాబూస్ వర్సిటీలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఇతర భాషల నుంచి ఆంగ్లంలోకి అనువాదమైన ఉత్తమ రచనలకు మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్‌ను బహుకరిస్తారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో అరబిక్ బోధకుడిగా పనిచేస్తున్న మార్లిన్ బూత్.. సెలెస్టియల్ బాడీస్ నవలను ఆంగ్లంలోకి అనువదించారు. బహుమతి కింద 60 వేల డాలర్లను అల్హార్థి, మర్లిన్‌కు సమానంగా అందజేస్తారు. మయ్యా, అస్మా, ఖావ్లా అనే అక్కచెల్లెళ్ల కథే ఈ నవల. ఒమన్‌లోని అల్-అవాఫీ అనే గ్రామంలో సాగే ఈ కథ.. ఆ దేశంలోని బానిసత్వ పరిస్థితులను కళ్లకుకట్టింది.