టీఎస్‌ఐఐసీలో ఈ-ఆఫీస్

-పేపర్‌లెస్ ఫైళ్ల ప్రక్రియ ప్రారంభం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఫైళ్లను సమర్థంగా నిర్వహించడానికి ఈ-ఆఫీస్ ఉపయోగపడుతుందని.. అందుకే ప్రప్రథమంగా కాగితరహిత విధానాన్ని టీఎస్‌ఐఐసీలో అమల్లోకి తెచ్చామని పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. సోమవారం సచివాలయంలోని టీఎస్‌ఐఐసీలో కార్యాలయంలో ఆయన ఈ-ఆఫీస్‌ను ప్రారంభించారు. ఇకనుంచి టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో కాగితాల రూపంలో ఫైళ్ల నిర్వహణ ఉండదని జయేశ్‌రంజన్ తెలిపారు. పరిపాలనలో నాణ్యతను పెంపొందించడమే కాకుండా మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవడానికి ఈ-ఆఫీస్ ఉపయోగపడుతుందని తెలిపారు. డిజిటల్ సిగ్నేచర్ వల్ల ఫైళ్ల రక్షణకూడా పక్కాగా ఉంటుందని చెప్పారు. రోజువారీ కార్యకలాపాలను సులువుగా నిర్వహించడానికి ఈ-ఆఫీస్ తోడ్పడుతుందన్నారు. టీఎస్‌ఐఐసీలో ఈ-ఆఫీసు కార్యకలాపాల్ని ఎంఐఎస్ వింగ్ పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ వీసీ వెంకటనర్సింహారెడ్డి, ఏడీఈ వత్సలమిశ్రా పాల్గొన్నారు.