సీఎం సభాస్థలిని పరిశీలించిన జీవన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి

ఆర్మూర్: ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనేందుకు గురువారం సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు రానున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో బహిరంగ సభాస్థలి ఏర్పాట్లను ఆర్మూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి పరిశీలించారు. సభావేదికను, ముందర జనం కోసం ఏర్పాటు చేసే గ్యాలరీలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ గురువారం ఆర్మూర్ ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్నారన్నారు. ప్రజా ఆశీర్వాద సభకు నియజకవర్గ ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. 50వేల పైచిలుకు జనం సభకు హాజరు కానున్నారని ఆశన్నగారి జీవన్‌రెడ్డి తెలిపారు. అనంతరం జిరాయత్‌నగర్‌లో తాజ్ పంక్షన్‌హాల్ పక్కన ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ స్థలాన్ని వారు పరిశీలించారు. అంతకుముందు సభాస్థలి రూట్‌మ్యాప్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆర్మూర్‌లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో రాఘవేందర్ తెలిపారు. ప్రజాఆశీర్వాద సభ కోసం ఆర్మూర్‌లో 1000 మంది పోలీసులతో బందోబస్తు చేస్తున్నట్లు చెప్పారు. సీపీ కార్తీకేయ ఆధ్వర్యంలో ముగ్గురు ఏసీపీలు, 10 మంది సీఐలు, 30 ఏస్సైలు, 100 ఏఏస్సైలు, 100 హెచ్‌కానిస్టేబుళ్లు, 450 మంది కానిస్టేబుళ్లు, 120 మంది మహిళా కానిస్టేబుళ్లు బందోబస్తు విధులు నిర్వర్తిస్తారన్నారు. వీరితో పాటు సీఎం కేసీఆర్ సెక్యూరిటీ ప్రత్యేక దళాలు, డాగ్ స్కాడ్‌టీంలు భద్రత కల్పిస్తాయన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆర్మూర్ పట్టణంలో గురువారం మధ్యాహ్నం 12గంటల నుంచి సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో రాఘవేందర్ తెలిపారు.

Related Stories: