మేడారం జాతరతో ములుగు జిల్లాకు గుర్తింపు

-జిల్లాకు గుర్తింపు తెచ్చేలా నిర్వహిద్దాం -మనసు పెట్టి పనిచేయాలి -15లోగా ప్రతిపాదనలు సిద్ధం కావాలి -ప్లానింగ్ పనుల్లో అలసత్వం వద్దు -నూతన జిల్లాలో మొదటి జాతర -జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తేతెలంగాణ: తెలంగాణ రాష్ర్టానికే మకుటమై.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరు గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరను పకడ్బందీ ప్రణాళికలతో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 2020, ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీల్లో జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ఏర్పాట్ల సమీక్షా సమావేశం బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చక్రధర్‌రావు అధ్యక్షతన జరిగింది. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్‌తో కలిసి సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రతీ జిల్లా అధికారి ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ను సిద్ధం చేయాలని సూచించారు. మేడారం జాతర విజయవంతానికి ప్రతీ ఉద్యోగి పక్కా ప్రణాళికతో పనులు చేయాలన్నారు. భక్తులకు వసతి, రక్షణ చర్యలపై అన్ని విభాగాల అధికారులు దృష్టి సారించాలని అన్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర జిల్లాకు గర్వకారణంగా, నిర్వహణ బాధ్యతల్లో పాలుపంచుకోవడం ప్రతి ఉద్యోగి అదృష్టంగా భావించాలని ఉద్బోధించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో మొదటిసారిగా నిర్వహిస్తున్న జాతరకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయాలని, ఇందుకు అధికారులు పక్కా ప్రణాళికలతో సిద్ధం కావాలని అన్నారు. ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర నిర్వహణను చాలెంజ్‌గా భావిస్తున్నామని తెలిపారు. మేడారం జాతర వచ్చే భక్తులకు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం, జాతరను విజయవంతం చేసేందుకు 11వేల మంది పోలీసులను జాతర విధుల్లో నియమించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రధానంగా మేడారం జాతర అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలని, ఇందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి భక్తులు ప్లాస్టిక్‌ను వాడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర నిర్వహణలో ట్రాఫిక్ జామ్ ప్రధాన సమస్య అని.. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు. అనంతరం 20 విభాగాలకు చెందిన అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. 2018లో నిర్వహించిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణ వ్యయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ విభాగం నుంచి కావాల్సిన ఏర్పాట్ల కోసం అవసరమయ్యే నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈ నెల 15వ తేదీన ఐటీడీఏ పీవోకు సమర్పించాలని ఆదేశించారు. గత జాతరకు రూ. 80కోట్ల 55లక్షల 57వేలను ప్రభుత్వం కేటాయించిందని, ఈ సారి జరిగే జాతరకు అవసరమయ్యే నిధులను ప్రభుత్వం మన ప్రతిపాదనలను బట్టి మంజూరు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. సమీక్ష నిర్వహించిన శాఖలు మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర నిర్వహణ ఏర్పాట్ల కోసం నిర్వహించిన సమీక్షా సమావేశంలో రోడ్డు భవనాల శాఖ వారు మేడారానికి వచ్చే రహదారుల వెడల్పు మరమ్మతుల కోసం గత జాతరలో రూ. 20కోట్లు మంజూరు చేయగా ఈ 2020లో జరిగే జాతర నిర్వాహణకు రోడ్లు మరమ్మతులు, వెడల్పుతో పాటు బారీకేడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేయనున్నారు. పస్రా, భూపాలపల్లి, కాటారం నుంచి మేడారం రహదారి, డబుల్ లైన్ పస్రా-భూపాలపల్లి రహదారి మరమ్మతు కోసం రూ.50లక్షలు, తాడ్వాయి నుంచి నార్లాపురం రహదారి మరమ్మతులకు రూ.3కోట్ల 60లక్షలు, అదేవిధంగా జంగాలపల్లి నుంచి గాంధీనగర్ రూ.50లక్షలు, పస్రా నుంచి భూపాలపల్లికి రూ. 50లక్షలు, బూర్గహాడ్ నుంచి ఏటూరునాగారం వరకు 50లక్షలు, భద్రాచలం నుంచి వాజేడు, వెంకటాపురం(నూగూరు) రహదారి మరమ్మతుల కోసం రూ.50లక్షలు, బారికేడ్ల ఏర్పాటుకు రూ. 40లక్షలు, మూడు హెలిప్యాడ్‌ల నిర్మాణానికి రూ. 30లక్షలు, ఆజంనగర్ -మేడారం లింకు రోడ్డు మరమ్మతులు, క్యాంపు కార్యాలయ మరమ్మతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. దేవాలయం సమీపంలో సీసీ రోడ్లు నిర్మాణం, చింతలకుంట రోడ్డు వెడల్పు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగం వారు చిన్నబోయినపల్లి నుంచి మేడారం వరకు రోడ్డు వెడల్పు, భవనాల మరమ్మతులు, అతిథి గృహాల మరమ్మతుకు, ఐటీడీఏ క్యాంపు కార్యాలయం, ఎడ్ల బండ్ల రహదారి, ఉద్యోగుల కోసం వసతి ఏర్పాటు, పార్కింగ్ ఏరియా వంటి ప్రతిపాదనలను సమర్పించనున్నట్లు తెలిపారు. ఆర్‌అండ్‌డబ్ల్యూఎస్ విభాగం అధికారులు గత జాతరకు 10,389 టాయిలెట్లను నిర్మించినట్లు తెలిపారు. 456 ప్రాంతాలలో 533 పీవోటీ టాయిలెట్లు, 40 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసి మిషన్ భగిరథ ద్వారా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జంపన్నవాగులో బ్యాటరీ ఆఫ్ ట్యాబ్‌లు, తదితర అంశాలపై ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా పంచాయతీ అధికారి జాతరలో చేపట్టాల్సిన పారిశుధ్య కార్యక్రమాలు, కార్మికులు వివరాలను వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో అండర్ డ్రైనేజ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు జాతర సమయంలో 2500 మంది కార్మికులను వినియోగించి 25 కిలోమీటర్ల పరిధిని 40 జోన్‌లుగా విభజించి బీచింగ్ పౌడర్ చల్లనున్నామని తెలిపారు. 250 మినీ డంపింగ్ యార్డులను ఏర్పా టు చేస్తామని తెలిపారు. గత జాతర దృష్టిలో పెట్టుకొని 100 శాతం పారదర్శకంగా ప్రతిపాద నలు రూపొందించాలన్నారు.. సమావేశంలో ఓఎస్డీ సురేశ్‌కుమార్, ఇన్‌చార్జీ డీఆర్వో కూతాటి రమాదేవి, డీఎస్పీ విజయసారథితో పాటు 20 విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Related Stories: