పంజాబ్‌లో తెలంగాణ ఇసుక పాలసీ

-యథాతథంగా అమలుచేయాలని నిర్ణయం -ముసాయిదా పాలసీని ప్రకటించిన పంజాబ్ ప్రభుత్వం -టీఎస్‌ఎండీసీ తరహాలో పీఎస్‌ఎండీసీ ఏర్పాటు
Siddu హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న ఇసుక పాలసీని తమ రాష్ట్రంలో యథాతథంగా అమలుచేయాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. పంజాబ్ రాష్ట్రమంత్రి నవజోత్‌సింగ్ సిద్ధూ గత నెలలో మూడురోజులపాటు రాష్ట్రంలో పర్యటించి ఇక్కడి ఇసుకపాలసీని స్వయంగా పరిశీలించిన సంగతి తెలిసిందే. క్షేత్రస్థాయికి వెళ్లి అధ్యయనం చేసిన ఆయన ఇక్కడి ఇసుక పాలసీ అద్భుతంగా ఉందని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇసుక తవ్వకాలు, అమ్మకాల్లో అక్రమాలకు తావులేకుండా, సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంచడంతోపాటు సరసమైన ధరలో లభ్యమయ్యేలా నూతన ఇసుక పాలసీని రూపొందించింది. ఈ విధానం సత్ఫలితాలు ఇవ్వడంతోపాటు, 2015-16 నుంచి మూడేండ్లలో రాష్ట్ర ఖజానాకు రూ.1500 కోట్ల ఆదాయం కూడా సమకూరింది. పారదర్శక విధానాలతో మంచి ఫలితాలు ఇస్తున్న తెలంగాణ ఇసుక పాలసీని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల అధికారులు, మంత్రు లు అధ్యయనం చేశారు. నాలుగు ప్రధాన నదులు ఉన్న పంజాబ్‌లో ఇసుకను ప్రజలకు అందుబాటు ధరల్లో అందించేందుకు.. తవ్వకాలు, అమ్మకాల్లో అక్రమాలకు తావులేకుండా పాలసీని రూపొందించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇసుక విధానంలో పారదర్శక విధానాలను చూపాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై స్పందించిన కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ఇసుక పాలసీ అమలవుతున్నదని, ఆ రాష్ర్టానికి వెళ్లి అధ్యయనం చేయాలని పంజాబ్‌కు సూచించింది. ఈ నేపథ్యంలో గత ఏప్రిల్‌లో పం జాబ్‌మంత్రి నవజోత్‌సింగ్ సిద్ధూ నేతృత్వంలోని బృం దం మూడురోజులపాటు తెలంగాణలో పర్యటించింది. ఇసుక తవ్వకాలు జరిపే ప్రాంతాలకు వెళ్లి స్వయంగా పరిశీలన జరిపింది. ఇసుక, ఖనిజాల అన్వేషణకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేయడం, ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ విధానం, ఇసుక రీచ్‌లకు జియోట్యాగింగ్, వేబ్రిడ్జిల ఏర్పాటు, రాష్ట్రప్రభుత్వమే ధరను నిర్ణయించడం, రవాణాలో అక్రమాలు లేకుండా చేయడం, స్టాక్‌యార్డ్‌ల ఏర్పాటు వంటి విధానాలు పంజాబ్ బృందాన్ని ఆకర్షించాయి. తెలంగాణలో అమలవుతున్న ఇసుక విధానాన్ని తమరాష్ట్రంలోనూ రూపొందించాలని సూచిస్తూ పంజాబ్ ఆర్థికమంత్రి మన్‌ప్రీత్ బాల్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి రాజీందర్‌సింగ్ బాజ్వా, రెవెన్యూమంత్రి సుఖ్‌బిందర్‌సింగ్ సర్కారియాలతో కూడిన నవజోత్‌సింగ్ సిద్ధూ నేతృత్వంలోని క్యాబినెట్ సబ్‌కమిటీ ముఖ్యమంత్రి అమరేందర్‌సింగ్‌కు ఈ నెల 7న నివేదిక సమర్పించింది. క్యాబినెట్ సబ్‌కమిటీ ఇచ్చిన సిఫారసులను ముసాయిదా రూపంలో ప్రచురించారు. త్వరలో క్యాబినెట్ ఆమోదం తరువాత నూతన ఇసుకపాలసీ అమల్లోకి రానుంది. ఇసుక తవ్వకాలు, అమ్మకాలకు తెలంగాణలో ఏర్పాటుచేసిన తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎండీసీ) తరహాలో పంజాబ్ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (పీఎస్‌ఎండీసీ) ఏర్పాటు చేయాలని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
× RELATED మహిళలకు మహర్దశ