జపాన్‌లో ఓ ఊరికి లక్ష్మీదేవి పేరు

బెంగళూరు: అవును నిజమే.. ఎక్కడో దేశం కాని దేశంలో మన హిందూ దేవత పేరును ఓ ఊరికి పెట్టారు. జపాన్ రాజధాని టోక్యోకు దగ్గరలో ఉండే ఆ ఊరి పేరు కిచిజోజి. జపనీస్‌లో కిచిజోజి అంటే లక్ష్మీదేవి ఆలయం. మా దేశంలో లక్ష్మీదేవి పేరు మీదుగా ఓ ఊరు ఉందంటే మీరు ఆశ్చర్యపోతారు అని కాన్సుల్ జనరల్ ఆఫ్ జపాన్ తకయుకి కిటాగవా చెప్పారు. దయానంద్ సాగర్‌లో గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులతో కిటాగవా మాట్లాడారు. నిజానికి ఇండియా, జపాన్ వేరు అని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. జపాన్ సంస్కృతిపై భారత్ ప్రభావం చాలా ఉంది. ఇక్కడి ఆలయాలు చాలావరకు హిందూ దేవతల పేరు మీదే ఉన్నాయి అని కిటాగవా చెప్పారు.

సూర్యుడు ఉదయించే నేలపై మరెంతోమంది హిందూ దేవతలు కొలువై ఉన్నారు. మేము ఎన్నో తరాలుగా హిందూ దేవతలనే పూజిస్తున్నాం అని ఆయన స్పష్టంచేశారు. తన ప్రసంగాన్ని ఆయన కన్నడలో మొదలుపెట్టి చాలా మందిని ఆశ్చర్యపరిచారు. జపనీస్ భాషలో చాలా పదాలు సంస్కృతం నుంచే వచ్చాయని కూడా కిటాగవా వెల్లడించారు. ఉదాహరణకు జపాన్ డిష్ సుషిని బియ్యం, వెనిగర్‌తో తయారుచేస్తారు. సుషిని షరి అని కూడా అంటారు. షరి అనే పదం సంస్కృత పదమైన జాలి నుంచి వచ్చింది. జాలి అంటే అన్నం అని కిటాగవా చెప్పారు. సంస్కృతం, తమిళం నుంచే సుమారు 500 జపనీస్ పదాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. భారత సంస్కృతే కాదు.. భారత భాషల ప్రభావం కూడా జపాన్‌పై చాలా ఉంది.

Related Stories: