30,020 బంతులేసి వరల్డ్ రికార్డు కొల్లగొట్టాడు

క్రైస్ట్‌చర్చ్: క్రికెట్ ఆటలో బ్యాట్స్‌మన్ పరుగులు సాధించడం కొంతమేర సులువైనప్పటికీ.. బౌలర్ బంతులేయడం మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది. బ్యాట్స్‌మన్‌తో పోలిస్తే బౌలర్లు తమ కెరీర్‌లో ఎక్కువ రోజులు క్రికెట్ కెరీర్‌లో కొనసాగలేరు. టెండూల్కర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో టెస్టులు, వన్డేల్లో కలుపుకొని 34,357 పరుగులు సాధించాడు. కానీ, ఒక ఫాస్ట్‌బౌలర్ 30వేలకు పైగా బంతులేయడం అంటే మామూలు విషయం కాదు. తాజాగా ఇంగ్లాండ్ స్పీడ్‌స్టర్ గొప్ప రికార్డును అందుకున్నాడు. ఇంగ్లాండ్ స్పీడ్‌స్టర్ జేమ్స్ ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అరుదైన ఫీట్ సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 30,020 బంతులు వేసిన ఫాస్ట్‌బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో వెస్టిండీస్ గ్రేట్ కోర్ట్నీ వాల్ష్ 30,019 బంతులేసిన తొలి ఫాస్ట్‌బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. తాజాగా ఆతిథ్య న్యూజిలాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్ ఆఖరి రోజైన మంగళవారం ఈ రికార్డును ఆండర్సన్ అధిగమించాడు. టెస్టుల్లో 500 వికెట్లు తీసుకున్న తొలి క్రికెటర్‌గా వాల్ష్ పేరిట రికార్డు ఉంది. వాల్ష్ తన కెరీర్‌లో 24.44 సగటుతో 519 వికెట్లు తీయగా.. ఇంగ్లీష్ బౌలర్ 27.34 సగటుతో ఇప్పటి వరకు 531 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా ఆండర్సన్ గొప్ప ఘనత అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక బంతులేసిన బౌలర్ల జాబితాలో మొత్తంగా ఆండర్సన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. టాప్-3లో ముగ్గురు స్పిన్నర్లే కావడం విశేషం. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 44,039 డెలివరీలు వేసి ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. తన టెస్టు కెరీర్‌లో 800 వికెట్లు తీసి ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే(40,850 బంతులు, 619 వికెట్లు), ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్(40,705 డెలివరీలు, 708 వికెట్లు) అత్యధిక బంతులేసిన వారి జాబితాలో ఉన్నారు.

Related Stories: