యాషెస్‌లో బాల్ టాంపరింగ్ దుమారం

మెల్‌బోర్న్‌ః యాషెస్ సిరీస్‌ను బాల్ టాంపరింగ్ వివాదం చుట్టుముట్టింది. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ బాల్ షేప్‌ను మారుస్తూ కెమెరాకు చిక్కాడు. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్‌లో బొటనవేలితో బాల్‌పై గీకుతూ దానిని గరుకుగా మార్చే ప్రయత్నం చేసినట్లు టీవీ రీప్లేల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణంగా కొత్త బంతిని రివర్స్ స్వింగ్ చేయడానికి ఇలా బాల్ షేప్‌ను మారుస్తుంటారు. ఆండర్సన్ ఇలా చేయడం చూసి కామెంట్రీ బాక్స్‌లో ఉన్న ఆస్ట్రేలియా మాజీలు ఆందోళన వ్యక్తంచేశారు. ఆ వెంటనే అంపైర్ కుమార ధర్మసేన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌తో మాట్లాడాడు. నిజానికి ఇలాంటివి చేసినా.. అంపైర్ అనుమతితో అతని ముందే చేయాల్సి ఉంటుంది. అయితే ఆండర్సన్ మాత్రం అంపైర్ అనుమతి లేకుండా బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కామెంట్రీ ఇస్తున్న షేన్ వార్న్, మైక్ హస్సీ దీనిని తప్పుబట్టారు. మ్యాచ్‌లో పైచేయి సాధించాలంటే చాలా వ్యూహాలు ఉంటాయని, ఇలా చేయడం సరికాదని హస్సీ అన్నాడు. బాల్‌కు ఒకవైపే ఇలా గరకుగా మారేలా చేస్తుంటారు. దీనివల్ల ఓవైపు బరువు పెరిగి బంతి అనూహ్యంగా స్వింగ్ అవుతుంది. ఈ ఘటన తర్వాత ఆసీస్ మాజీ పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఓ ట్వీట్ చేశాడు. 10 ఓవర్లలోనే రివర్స్ స్వింగ్ ఎలా అవుతుందో అంటూ అతను అనుమానం వ్యక్తంచేశాడు. యాషెస్ నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 491 పరుగులు చేసిన ఇంగ్లండ్.. మొత్తం 164 పరుగుల ఆధిక్యం సాధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 103 పరుగులు చేసింది. ఇంకా 61 పరుగులు వెనుకబడే ఉంది. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Related Stories: