వాననీటిని భూమిలోకి ఇంకేలా చేసేందుకు..

బంజారాహిల్స్: విలువైన వాన చుక్కను భూమిలోకి ఇంకించడం ద్వారా భూగర్భజలాలను పెంపొందించడం..వాననీటిని శుద్ధిచేయడంతోపాటు ఆ నీటిని అవసరాల కోసం వినియోగించుకోవడం ఎలా అనే విషయాలను నేరుగా ప్రజలకు వివరించడం.. ప్రజలకు అందుబాటులో ఉన్న స్థలంలో వాననీటి సంరక్షణ ఎలా చేసుకోవచ్చు అనే పద్ధతులపై శిక్షణ ఇవ్వడంతో పాటు వాననీటి సంరక్షణపై పూరిస్థాయి సమాచారం అందించేందుకు నగరంలో తొలిసారి జలమండలి సిద్ధమైంది. సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్‌పార్కు జూబ్లీహిల్స్ రోడ్ నెం 51లో ప్రారంభానికి ముస్తాబవుతున్నది. జలం-జీవం కార్యక్రమంలో భాగంగా వాననీటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఇటీవల మంత్రి కేటీఆర్ జలమండలి అధికారులను ఆదేశించారు.

దీంతో వాననీటి సంరక్షణ, వినియోగంపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అవలంభిస్తున్న విధానాలపై జలమండలి ఎండీ దానకిషోర్ అధ్యయనం చేయించారు. ఇందులో భాగంగా బెంళూరులోని జయనగర్‌లో ఉన్న ఎం.విశ్వేశ్వరయ్య రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ థీమ్‌పార్కు గురించి తెలుసుకున్నారు. ఈ పార్కుద్వారా వాననీటి సంరక్షణ చేసే విధానాలను నేరుగా ప్రజలకు చూపించేందుకు వీలుంటుందని భావించారు. ఈ నేపథ్యంలో సుమారు రూ.1.68 లక్షల వ్యయంతో జూబ్లీహిల్స్ రోడ్‌నెం.51లోని ఒకటిన్నర ఎకరాల స్థలంలో మూడు నెలల క్రితం ప్రారంభమైన థీమ్ పార్కు పనులను జలమండలి అధికారులు రికార్డు సమయంలో పూర్తిచేశారు. ఒకట్రెండు రోజుల్లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా థీమ్‌పార్క్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఒడిసి పట్టేందుకు రకరకాల పద్ధతులు :

వాననీటిని భూమిలోకి ఇంకేలా చేసేందుకు ఇంకుడుగుంతలు నిర్మించడం ఒక్కటే మార్గం అని అనుకుంటారు. అందుబాటులో ఉన్న స్థలానికి తగ్గట్లు ఇంకుడు గుంతల డిజైన్లు అందుబాటులో ఉన్నాయని జలమండలి అధికారులు అంటున్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లో కొత్తగా నిర్మిస్తున్న థీమ్ పార్కులో వివిధ రకాల ఇంకుడు గుంతల డిజైన్లను ఏర్పాటు చేశారు. ఆయా డిజైన్లను ప్రజలకు చూపించడంతోపాటు వాటిని నిర్మించుకునేందుకు అవసరమయ్యే శిక్షణను కూడా ఈ థీమ్ పార్క్‌లో అందించనున్నారు. పార్కు మొత్తాన్ని యూనిట్‌గా తీసుకుని అక్కడ పడే వర్షపునీటిని మొత్తం నిల్వ చేయడంతో పాటు ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపించేలా నిర్మాణాలు చేపట్టారు. దీనికితోడు పార్కులో నిర్మించిన భారీ సంపుల్లోకి వాన నీరు చేరేలా కాల్వలను ఏర్పాటు చేశారు. వర్షానికి ఈ సంపుల్లోకి వచ్చే నీటిని ఫిల్టర్ చేసి తాగునీటి అవసరాల కోసం వినియోగించేలా ఏర్పాట్లు చేశారు. మిగిలిన నీటిని మొక్కలకు,గ్రీనరీకి ఉపయోగిస్తారు. థీమ్ పార్కులో నీటి విలువ తెలిపే బోర్డులు, సమాచార కేంద్రం, వాటర్ గ్యాలరీ, సివరేజ్ గ్యాలరీ, ఆడిటోరియం నిర్మించారు. చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా యానిమేషన్ రూమ్‌ను నిర్మించి జలసంరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు థీమ్ పార్కులో వాకింగ్ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేశారు.

సాధారణ ఫుట్‌పాత్ కాకుండా వర్షపునీరు భూమిలోకి ఇంకేలా నిర్మాణం చేశారు. వాన నీరు, తాగునీటి విలువను తెలిపేలా తరచూ విద్యార్థులకు ఆటలు, క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు. నగరానికి ఎక్కడెక్కడి నుంచి నీళ్లు వస్తాయి..వాటిని ఎలా సరఫరా చేస్తున్నారు.. భవిష్యత్తులో నీటి డిమాండ్ ఇతరత్రా అన్ని విషయాలను థీమ్ పార్కు ద్వారా తెలుసుకునే వీలుంది. సుమారు 10 వేల మొక్కలతో పార్కును మొత్తం పచ్చదనంతో నింపుతున్నారు. అన్ని రాశులకు సంబంధించిన మొక్కలను, ఔషధ మొక్కలను,వివిధ ప్రాంతాల్లో పెరిగి రకరకాలైన మొక్కలను కూడా పార్కులో ఉంచారు. ఒకట్రెండు రోజుల్లో పార్కును ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతుండడంతో తుది మెరుగులు దిద్దుతున్నారు.

Related Stories: