శ్రీలంక నుంచి స్వదేశానికి బయలుదేరిన గంట వ్యవధిలోనే..

మెట్‌పల్లి:శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్ల నుంచి అదృష్టవత్తూ జగిత్యాల జిల్లాకు చెందిన పలు కుటుంబాలు సురక్షితంగా బయట పడ్డాయి. మూడు రోజులుగా బస చేసిన హోటల్ నుంచి స్వదేశానికి తిరుగుపయనం అయిన గంట వ్యవధిలోనే తాము బసచేసిన హోటల్ పక్కనే ఆనుకొని ఉన్న మరో హోటల్‌లో బాంబు పేలుళ్లు జ‌రిగాయ‌ని అక్క‌డ ప‌ర్య‌టించి తిరిగొచ్చిన వారు తెలిపారు. శ్రీలంక నుంచి స్వదేశానికి తిరుగుప్రయాణంలో ఉన్న మెట్‌పల్లి పట్టణానికి చెందిన న్యాయవాది ఏలేటి నరేందర్‌రెడ్డి ఫోన్లో నమస్తే తెలంగాణకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరేందర్‌రెడ్డి-వందన, అల్లాడి శ్రీనివాస్-సత్యదేవి, కోరుట్లకు చెందిన బాసెట్టి కిషన్ సహా ఆరు కుటుంబాలు తీర్థ, విహార యాత్రలో భాగంగా వారం రోజుల కిందట శ్రీలంక వెళ్లారు. అక్కడ వివిధ ప్రాంతాలను సందర్శించిన అనంతరం మూడు రోజుల కిందట కొలంబోలోని నెరేల్ల మారియన్ హోటల్‌లో దిగారు. రాజధానిలోని శాంకరి శక్తి పీఠం తదితర ఆలయాలు, పర్యాక ప్రదేశాలను సందర్శించారు. ఆదివారం ఉదయం 7 గంటలకు కొలంబో విమానాశ్రయానికి చేరుకుని స్వదేశానికి విమానంలో బయలు దేరారు. సరిగ్గా శంషాబాద్ విమనాశ్రయంలో దిగిన వెంటనే తాము బసచేసిన హోటల్‌కు ఆనుకొని ఉన్న సెరేల్ల మారియన్ హోటల్‌లో బాంబు పేలుళ్లు జరిగినట్లు సమాచారం రావడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతిగా లోనయ్యారు. అక్కడే ఉండి ఉంటే తమకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యేవోననీ, ఊహించుకుంటేనే భయంగా ఉందనీ, దేవుడి దయవల్ల సురక్షితంగా స్వదేశానికి చేరుకోగలిగామని నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
More in అంతర్జాతీయం :