కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు

సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి నివేదన సభ అని ప్రకటించిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వణుకు పుట్టిందని, సభకు సమ్మక్క సారలమ్మ, పెద్దగట్టు జాతరల కంటే రెట్టింపు జనం వస్తుండడంతో ఈ జన సంద్రంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట నియోజకవర్గం నుంచి 300 ట్రాక్టర్లలో రైతులు పెద్ద ఎత్తున హైదరాబాద్ ప్రగతి నివేదన సభకు తరలి వెళ్తుండగా మంత్రి ప్రారంభించి స్వయంగా ట్రాక్టర్‌ను నడుపుకుంటూ పది కిలోమీటర్ల మేర వెళ్లారు. అంతకు ముందు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో సుమారు 2వేల ట్రాక్టర్లతో శుక్రవారం రాత్రి సూర్యాపేటకు చేరుకొని బస చేయగా స్థానిక టేకుమట్ల వద్ద ఎంపీతో కలిసి తిరిగి ర్యాలీని ప్రారంభించారు. ఆయా సందర్భాలలో మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం పండుగలా మారడంతోపాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలతో ప్రజలు సీఎం కేసీఆర్ పట్ల అభిమానం చూపుతున్నారని, దానికి ఉదాహరణే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ట్రాక్టర్లలో లక్షలాది రైతుల దండు కదలి రావడం అన్నారు. రైతులు ఎంతో ఓపికతో వందలాది కిలోమీటర్లు ట్రాక్టర్లపై తరలి వస్తున్నారని, వారికి పాదాభివందనం చేస్తున్నానన్నారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని ప్రజలు కొంతమేర అభిమానించి కొన్ని సీట్లు ఇవ్వడంతో కనీసం ప్రతిపక్ష హోదా దక్కిందని, అయితే ప్రస్తుతం వారు అభివృద్ధికి వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలు, ప్రకటనలతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటే రాకుండా పారిపోయారని, జాతీయ నాయకులను తెచ్చి సభ పెడితే 15వేల మంది రాలేదని, కానీ మీడియా ముందు మాత్రం కోతలు కోస్తారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమాలను సమాంతరంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన కాంగ్రెస్ తమ వెంట ప్రజలు రావట్లేదనే దుగ్ధతోనే నీతిమాలిన అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ఎంపీ తుమ్మల నాగేశ్వర్‌రావుతోపాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సమన్వయంతో 2వేల ట్రాక్టర్లతో సభకు బయలు దేరగా సూర్యాపేట టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారని అభినందనలు తెలిపారు. ఈ సభకు ఇతర దేశాలు, రాష్ర్టాల నుంచి తెలంగాణ బిడ్డలు తరలి వస్తుండడం చాలా సంతోషంగా ఉందని, దేశంలో ఎక్కడికి వెళ్లినా తెలంగాణ బిడ్డలు గర్వంగా తలెత్తుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారన్నారు. ఈ కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ టీఆర్‌ఎస్ అధ్యక్షులు బీరవోలు సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
× RELATED ధోనీ డకౌట్.. ఈ చిన్నారి అభిమాని ఆవేశం కట్టలు తెంచుకుంది!