ఐటీ హబ్‌లో ట్రాఫిక్ సమస్యను తీర్చుతాం

అర్బన్ మొబిలిటీ టాస్క్‌ఫోర్స్ కమిటీ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఐటీ హబ్‌లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటామని అర్బన్ మొబిలిటీ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ జీ వివేక్ తెలిపారు. బేగంపేటలోని మెట్రో భవన్‌లో గురువారం తొలి అర్బన్ మొబిలిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ హైదరాబాద్ నగర భవిష్యత్ రవాణా అవసరాలపై టాస్క్‌ఫోర్స్ దృష్టి సారించాలన్నారు. మంచి ప్రజారవాణా వ్యవస్థ కాలుష్యరహితంగా ఉండాలని, ప్రజలను చివరి గమ్యస్థానానికి సులభంగా చేర్చేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ మాట్లాడుతూ అర్బన్ మొబిలిటీకి సంబంధించి సమీకృత వివరణాత్మక విధానాన్ని రూపొందించాల్సిన అవసరముందని చెప్పారు. ఆర్టీసీ, మెట్రోరైలు, టీఎస్‌ఐఐసీ వంటి పలు విభాగాల మధ్య చక్కటి సమన్వయం ఉండాలన్నారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్, ైస్కెవాక్స్, సైడ్ వాక్స్ ఇతర పాదచారుల సౌకర్యాల గురించి ప్రత్యేకంగా చర్చించారు. హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ఐటీ హబ్‌లో దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగులు పని చేస్తారని, ట్రాఫిక్ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారాలను చర్చించేందుకు ఇక నుంచి నెలకోసారి చివరి శనివారం సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Stories: