రీశాట్-2బీఆర్1 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

చెన్నై: ఇస్రోలో సంబరాలు మిన్నంటాయి. పీఎస్‌ఎల్‌వీ సీ -46 ప్రయోగం విజయవంతమైంది. మరో విజయాన్ని ఇస్రో తమ ఖాతాలో వేసుకుంది. అత్యంత ఆధునిక రాడార్ ఇమేజింగ్ భూపరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 615 కిలోల బరువున్న రీశాట్-2బీఆర్1 ఉపగ్రహంను పీఎస్‌ఎల్‌వీ సీ 46 రాకెట్ మోసుకెళ్లింది. 557 కి.మీ ఎత్తులోని కక్ష్యలోకి ఉపగ్రహన్ని వాహక నౌక ప్రవేశపెట్టింది. రాకెట్ బయలుదేరిన తరువాత 15.29 నిమిషాలకు రీశాట్2బీఆర్1 ఉపగ్రహం రాకేట్ నుంచి విడిపోయి కక్ష్యలోకి ప్రవేశించింది. రీశాట్-2బీఆర్1 ఉపగ్రహం కాలపరిమితి ఐదేళ్లు. వ్యవసాయ, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తుల్లో ఉపగ్రహం సహాయపడనుంది. రీశాట్ సిరీస్‌లో ఇది నాలుగో ఉపగ్రహం. 2009లో పంపిన రైశాట్-2 ఉపగ్రహం స్థానంలోకి దీనిని చేరుస్తారు. ఇందులో అమర్చిన అత్యాధునిక రాడార్ భూమిపై ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా స్పష్టమైన ఛాయాచిత్రాలను అందించగలుగుతుంది. ఇది ప్రధానంగా వాతావరణ మార్పులపై నిఘా ఉంచనున్నది. వ్యవసాయ శాఖకు, అటవీ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడనున్నది. విపత్తుల సమయంలో అత్యవసర సహాయం అందిస్తుంది. అంతేకాకుండా సైన్యం నిఘా కార్యకలాపాలకు కూడా సహాయపడనున్నది. ఇస్రో చైర్మన్ కే శివన్ మాట్లాడుతూ... రైశాట్-2బీ ప్రయోగం భారతదేశానికి, ఇస్రోకు అత్యంత ముఖ్యమైన మిషన్ అని పేర్కొన్నారు.

Related Stories: