అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పాలమూరు పోలీసులు పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ అనురాధ విలేకరుల సమావేశంలో ముఠా వివరాలను వెల్లడించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని పాల్వాయి గ్రామానికి చెందిన వడ్డె గోపాల్, వడ్డె ఆంజనేయులు, వడ్డె లక్ష్మణ్, వడ్డె హరికృష్ణ ముఠాగా ఏర్పడి ఉదయం సమయంలో రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి రాత్రిళ్లు చోరీలకు పాల్పడేవారని తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని నాంపల్లి, చౌటుప్పల్‌తోపాటు ఆలేరు, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అప్పాయిపల్లి గ్రామంలోని వడ్డె లక్ష్మమ్మ ఇంట్లో గత నెల 28న చోరీకి పాల్పడగా.. లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అయితే జిల్లా కేంద్రంలోని మోతీనగర్‌లో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా కొందరు ఉన్నారన్న సమాచారం మేరకు సోమవారం పోలీసులు వెళ్లి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో వడ్డె గోపాల్ పాత నేరస్థుడిగా గుర్తించాడు. నిందితులను విచారించగా.. ఎక్కడెక్కడ చోరీలకు పాల్పడ్డారో వివరించారని తెలిపారు. గోపాల్‌పై ఇప్పటికే 70 దొంగతనం కేసులు ఉన్నట్లు వివరించారు.వీరి నుంచి 18 తులాల బంగారం, 52 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Related Stories: