ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌తో టైప్ 2 డయాబెటిస్‌కు చెక్..!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో చాలా మంది టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోకపోతే టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఇందుకు అనేక కారణాలుంటాయి. అధిక బరువు, థైరాయిడ్, అధిక కొలెస్ట్రాల్ ఉండడం, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, వేళకు భోజనం చేయకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, వ్యాయామం చేయకపోవడం.. వంటి కారణాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఈ క్రమంలోనే మన జీవన విధానంలో పలు మార్పులు చేసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చు. అయితే ఇవే కాకుండా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల కూడా టైప్ 2 డయాబెటిస్‌ను సమర్థవంతంగా అదుపు చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే..?

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే.. రోజులో చాలా గంటలపాటు భోజనం తీసుకోకుండా ఉండి, కేవలం కొన్ని గంటల్లోనే రోజుకు సరిపడినంత ఆహారం తీసుకోవడం అన్నమాట. అంటే.. రోజుకు 24 గంటలు కదా. అందులో 16 గంటలు ఖాళీగా ఉండాలి. ఎలాంటి ఆహారం తీసుకోరాదు. మిగిలిన 8 గంటల్లో ఆహారం తినాలి. రోజుకు సరిపోయే ఆహారాన్ని ఆ వ్యవధిలోనే తీసుకోవాలి. దీని వల్ల శరీరం ఇన్సులిన్‌ను బాగా ఉపయోగించుకుంటుంది. తద్వారా రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండి, టైప్ 2 డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. అయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ను మరిన్ని రకాలుగా కూడా చేయవచ్చు. అదెలాగంటే... వారానికి రెండు రోజులు ఉపవాసం ఉండాలి. లేదా రోజు తప్పించి రోజు వారంలో 2, 3 రోజులు ఉపవాసం ఉండాలి. ఇలా ఉపవాసం ఉండడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వల్ల కలిగే దుష్పరిణామాల నుంచి తప్పించుకోవచ్చని కెనడాకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.

Related Stories: