హాంకాంగ్ మ్యాచ్‌లకు వన్డే హోదా

న్యూఢిల్లీ: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌తో హాంకాంగ్ ఆడే మ్యాచ్‌లకు వన్డే హోదా ఇచ్చేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఈనెల 15 నుంచి యూఏఈ వేదికగా మొదలయ్యే ఆసియాకప్‌లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు క్వాలిఫయర్ టోర్నీలో విజేతగా నిలిచిన హాంకాంగ్ బరిలోకి దిగుతున్నది. అయితే అర్హత టోర్నీ ఫైనల్లో యూఏఈపై విజయం సాధించిన హాంకాంగ్ ప్రస్తుతం ఐసీసీలో అనుబంధ దేశంగా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఐసీసీ గుర్తింపు లేని దేశాల మ్యాచ్‌లకు అధికారిక వన్డే హోదా అనేది దక్కదు. భారత్, పాక్‌తో హాంకాంగ్ ఆడే మ్యాచ్‌లకు వన్డే హోదా ఇవ్వాలంటూ ఐసీసీని కోరాం, దీనికి వారికి సమ్మతించారు అని బీసీసీఐ సీనియర్ అధికారి పేర్కొన్నాడు. ఈనెల 18న భారత్, హాంకాంగ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.