ఓటమితో సిరీస్ ముగింపు

rani కొరియా చేతిలో ఓడిన రాణిసేన జించియాన్(కొరియా): దక్షిణకొరియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల హాకీ జట్టు ఓటమితో ముగించింది. సిరీస్‌లో శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో రాణి రాంపాల్ సారథ్యంలోని భారత్ 0-4 తేడాతో కొరియా చేతిలో ఓటమిపాలైంది. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాల ద్వారా సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న టీమ్‌ఇండియా..ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేయడంలో విఫలమైంది. మరోవైపు మ్యాచ్‌లో ఐదు పెనాల్టీ కార్నర్లు పొందిన కొరియా 29వ నిమిషంలో జాంగ్ హీసెన్ గోల్‌తో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇదే అదనుగా తమ దాడులకు మరింత పెదునుపెట్టిన కొరియా ైస్ట్రెకర్లు కిమ్ హ్యున్జి, కాంగ్ జినా వరుస గోల్స్‌తో విజృంభించడంతో స్కోరు 3-0కు చేరుకుంది. భారత్ పుంజుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. మ్యాచ్ మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా లీ యురీ గోల్‌తో కొరియా 4-0తో విజయాన్ని ఖరారు చేసుకుంది. నేర్చుకునే క్రమంలో ఇలాంటి గెలుపు, ఓటములు సహజమని భారత చీఫ్ కోచ్ జోయర్డ్ మార్జిన్ అన్నాడు.