భారత షట్లర్ల శుభారంభం

టోక్యో: భారత నంబర్‌వన్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ జపాన్ ఓపెన్‌లో రెండోరౌండ్‌కు దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోటీలలో కిడాంబి, ప్రణయ్ సునాయాస విజయాలతో ముందంజ వేయడం విశేషం. మహిళల సింగిల్స్‌లో టోర్నీ మూడోసీడ్ సింధు 53 నిమిషాలపాటు పోరాడి 21-17,7-21,21-13 స్కోరుతో స్థానిక అమ్మాయి, అన్‌సీడ్ సయాకా తకాషినిపై గెలిచింది. తొలిగేమ్‌లో సింధు నెగ్గినా..రెండోగేమ్‌లో మాత్రం తకాషిని అద్భుత ఆటతీరుతో చెలరేగింది. దీంతో కీలకమైన మూడోగేమ్‌లో మాత్రం సింధు తన ప్రతాపం చూపి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను గెలిచి రెండో రౌండ్ చేరింది. రెండోరౌండ్‌లో చైనాకు చెందిన ఫ్యాంగ్జి జావోను ఢీకొట్టనుంది. ఫ్యాంగ్జి భారత్‌కే చెందిన జక్కా వైష్ణవిరెడ్డిపై 21-10,21,18 స్కోరుతో విజయంసాధించింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ 21-18,21,17 స్కోరుతో ఆసియా క్రీడల స్వర్ణపతక విజేత, ఇండోనేషియాకు చెందిన క్రిస్టీని ఓడించి ముందంజ వేశాడు. కాగా..భారత నంబర్‌వన్ షట్లర్ శ్రీకాంత్ 21-13,21-15 స్కోరుతో చైనా షట్లర్ యుజియాంగ్ హువాంగ్‌ను చిత్తు చేసి తొలిరౌండ్ అడ్డంకిని అధిగమించాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా, సిక్కిరెడ్డి జోడీ రెండోరౌండ్‌లో అడుగుపెట్టింది.