2050 నాటికి నంబర్-1 ఇండియా

వచ్చే 30 ఏండ్లలో అమెరికాను దాటేస్తాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా ఇక తన ప్రాభాల్యాన్ని కోల్పోతున్నదా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇదే నిజమేననిపిస్తున్నది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ శరవేగంగా దూసుకుపోతుండటంతో 2050 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశం తొలి స్థానాన్ని ఆక్రమించే అవకాశాలున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉన్నది. తొలి స్థానంలో అమెరికా ఉండగా, రెండో స్థానంలో చైనా, ఆ తర్వాతి స్థానంలో జపాన్ ఉన్నది. 2020 నాటికి భారత్..జపాన్‌ను దాటేసి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నదని ఇటీవల సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా ఆసియా-పసిఫిక్ దేశాల విషయానికి వస్తే చైనా, భారత్‌లు వృద్ధిలో పోటీపడుతున్నాయి. 2025 నాటికి ఆసియా-పసిఫిక్ దేశాల్లో నివసిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుండటం, ఇతర దేశాలు పెద్దగా ఆకట్టుకోలేక పోవడం కూడా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవడానికి దోహదపడే అంశాలని పేర్కొంది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు బలహీనపడుతుండటంతో ఆసియా దేశాలు మాత్రం దృవతారాల్లా వెలుగుతున్నాయి. ప్రపంచ చోధక శక్తికి ఇప్పటికే భారత్ మూలస్థంభంగా మారింది. గతేడాది నుంచి చైనా వృద్ధిరేటు నెమ్మదించింది.

2015లో చైనాలో వంద కోట్లకు పైగా మంది పనిచేస్తుండగా, ఇది 2030 నాటికి 97 కోట్లకు తగ్గనున్నరాని అంచనా. అదే భారత్ విషయానికి వస్తే మూడేండ్ల క్రితం 86 కోట్ల మంది పనిచేస్తుండగా, వచ్చే పుష్కరకాలం నాటికి 103 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇది కూడా దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి దోహదపడే అంశం. మిగతా దేశాల విషయానికి వస్తే అమెరికాలో పెద్దగా మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు. రష్యాలో 11 శాతం, జపాన్‌లో 10 శాతం తగ్గనున్నారని పేర్కొంది. కార్పొరేట్ సంస్థల విషయానికి వస్తే అమెరికాలో 564 ఉండగా, అదే చైనాలో 262, జపాన్‌లో 229, దక్షిణ కొరియాలో 64, భారత్ విషయానికి వస్తే 58 ఉన్నాయని తెలిపింది. ఇక ఎగుమతుల్లోనూ భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నది. 2016లో భారత్ నుంచి 430 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. పొరుగు దేశమైన చైనా నుంచి 2.8 ట్రిలియన్ డాలర్లు, అమెరికా నుంచి 2.2 ట్రిలియన్ డాలర్లు, జపాన్ నుంచి 809 బిలియన్ డాలర్లు, రష్యా నుంచి 332 బిలియన్ డాలర్ల మేర ఎగుమతి అయ్యాయి.

Related Stories: