లంక పర్యటనకు మిథాలీసేన

దుబాయ్: ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటన ఖరారైంది. సోమవారం ఐసీసీ తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈనెల 11నుంచి భారత్, శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది. దీని కోసం హైదరాబాదీ మిథాలీరాజ్ సారథ్యంలో 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఇటీవల సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ ఓటమి చవిచూసిన టీమ్‌ఇండియా..లంకపై విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నది. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో సామర్థ్యం మేరకు ఆడేందుకు అందరం ప్రయత్నిస్తాం. జట్టంతా సమిష్టిగా పోరాడి పాయింట్ల పట్టికలో టాప్‌లో చోటు దక్కించుకోవాలనుకుంటున్నాం. రానున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా భావిస్తున్నాం అని మిథాలీరాజ్ అంది. 2021లో జరిగే ప్రపంచకప్ కోసం అర్హత టోర్నీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడిన భారత్ ప్రస్తుతం నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నది. పాకిస్థాన్, వెస్టిండీస్‌పై ఓటములు ఎదుర్కొన్న లంక ఇంకా పాయింట్ల ఖాతా తెరువలేదు.

జట్టు వివరాలు:

మిథాలీరాజ్(కెప్టెన్), తన్యా భాటియా, ఏక్తా బిస్త్, రాజేశ్వరీ గైక్వాడ్, జులన్ గోస్వామి, హేమలత, మాన్సీ జోషి, హర్మన్‌ప్రీత్‌కౌర్, వేదా కృష్ణమూర్తి, స్మృతి మందన, శిఖా పాండే, పూనమ్ రౌత్, జెమీమా రోడ్రిగెజ్, దీప్తిశర్మ, పూనమ్ యాదవ్.