బాక్సర్ల పతకాల పంట..

Sarita-Devi - స్వర్ణాలతో మెరిసిన మేరి, సరిత ఇండియన్ ఓపెన్ బాక్సింగ్ గువాహటి: ఇండియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. టోర్నీలో ఆది నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మనోళ్లు మొత్తం 12 స్వర్ణ పతకాలు కొల్లగొట్టారు. ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ మేరికోం, సరితా దేవి, అమిత్ పంగల్, శివ తాపా పసిడి పతకాలతో మెరిశారు. మహిళల 60కిలోల ఫైనల్ బౌట్‌లో సరితా దేవి 3-2 తేడాతో సిమ్రన్‌జిత్‌కౌర్‌పై విజయం సాధించింది. తొలి రౌండ్‌లో అదరగొట్టిన సిమ్రన్‌జిత్ పదునైన పంచ్‌లతో సరితపై విరుచుకుపడింది. కానీ ఒక్కసారిగా పుంజుకుని పోటీలోకి వచ్చిన సరిత ప్రతిదాడులతో దీటైన సమాధానమిస్తూ ఆఖరికి విజేతగా నిలిచింది. 51కిలోల తుదిపోరులో మేరికోం..వాన్‌లాల్ దువాటి(మిజోరాం)పై విజయంతో పసిడి అందుకుంది. ఇదే విభాగంలో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్, జ్యోతికి కాంస్య పతకాలు దక్కాయి. పురుషుల 60కిలోల ఫైనల్ పోరులో శివ తాపా..మనీశ్ కౌశిక్‌పై విజయంతో పసిడి ముద్దాడాడు. 52కిలోల విభాగంలో అమిత్ పంగల్..సచిన్ సివాచ్‌పై గెలుపుతో స్వర్ణం దక్కించుకోగా, పీ లలిత ప్రసాద్, సోలంకి కాంస్యాలు సాధించారు.