ట్రంప్‌కు ఇండియా ఆహ్వానం.. నిర్ణ‌యం తీసుకోలేద‌న్న అమెరికా

వాషింగ్టన్: ప్రతి ఏటా గణతంత్ర వేడుకలకు ఓ దేశాధినేతను ఇండియా ఆహ్వానిస్తుంది. అలాగే వచ్చే ఏడాది ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆహ్వానం పంపించింది. ఇండియా ఆహ్వానం అందిందని, అయితే ట్రంప్ రాకపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని యూఎస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ వెల్లడించారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ వచ్చే నెలలో ఇండియా వస్తున్నారు. వచ్చే ఏడాది ట్రంప్ రాకపై వాళ్లు అక్కడి అధికారులతో చర్చిస్తారు అని శాండర్స్ తెలిపారు. గతంలో 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇప్పుడు మరోసారి అమెరికా అధ్యక్షుడికి మోదీ ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. ఈ ఏడాది జరిగిన వేడుకలకు ఏషియాన్ దేశాలైన థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనై దేశాధినేతలు ముఖ్య అతిథులుగా హాజరైన విషయం తెలిసిందే. అమెరికా వస్తువులపై ఇండియాలో భారీగా దిగుమతి పన్నులు వేస్తుండటంతోపాటు ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులను పూర్తిగా నిలిపేయాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఇండియా పంపిన ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..