లైంగికదాడి కేసులో బిషప్ ములక్కల్ అరెస్ట్

- మూడు రోజుల విచారణ అనంతరం పోలీసుల అదుపులోకి.. - కేసు నమోదై 84 రోజుల తర్వాత చర్యలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: కేరళ నన్‌పై లైంగికదాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో వరుసగా మూడో రోజు విచారించిన పోలీసులు శుక్రవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ములక్కల్‌పై లైంగికదాడి కేసు నమోదై దాదాపు 84 రోజుల తర్వాత ఆయనను అరెస్టు చేయడం గమనార్హం. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలంటూ కేరళలో నన్‌లు కొద్ది రోజుల నుంచి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎట్టకేలకు చర్యలకు దిగినట్లు తెలుస్తున్నది. కొట్టాయం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ములక్కల్ లైంగికదాడికి పాల్పడినట్లు తేలిందని చెప్పారు. కేరళ మంత్రి జయరాజన్ మాట్లాడుతూ బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ములక్కల్ ఇప్పటికే కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై ఈ నెల 25న విచారణ జరుగనున్నది.

Related Stories: