భారత్, కివీస్ ఎ మ్యాచ్ డ్రా

మౌంట్ మౌన్‌గనుయి(న్యూజిలాండ్): భారత్ ఎ, న్యూజిలాండ్ ఎ జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 35/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజైన సోమవారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషా(50), మురళీ విజయ్(60) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. మంచిఫామ్‌మీదున్న షా..కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తన ఇన్నింగ్స్‌లో 8ఫోర్లు, ఓసిక్స్‌తో అలరించాడు. మరోవైపు ఫామ్‌లేమితో సతమతమవుతున్న సీనియర్ విజయ్..అర్ధసెంచరీతో ఆసీస్ టెస్ట్ సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు. వీరిద్దరు కలిసి తొలివికెట్‌కు 74 పరుగులు జోడించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మయాంక్ అగర్వాల్(42), కెప్టెన్ రహానే(41 నాటౌట్), హనుమ విహారి(51 నాటౌట్) రాణించారు. బ్రేస్‌వెల్, టిక్నర్, వాన్ వోక్రోమ్‌కు ఒక్కో వికెట్ దక్కింది.