హెచ్‌ఐవీ రోగులను వేధిస్తే జైలుకే!

-అమలులోకి హెచ్‌ఐవీ/ఎయిడ్స్ చట్టం-2017 -గెజిట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశంలోని హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బాధితులకు సమాన అవకాశాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హెచ్‌ఐవీ/ఎయిడ్స్ యాక్ట్-2017 సోమవారం నుంచి అమలు లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసింది. ఈ చట్టం ప్రకారం హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు వైద్య చికిత్స అందించడంలో, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో సీటు ఇవ్వడంలో, ఉద్యోగంలో చేర్చుకోవడంలో, ఇల్లు కిరాయికి ఇవ్వడంలో వివక్ష ప్రదర్శించడం నేరం. చట్టప్రకారం ఒక వ్యక్తి అనుమతి తీసుకోకుండా హెచ్‌ఐవీ పరీక్షలు, వైద్య చికిత్స, పరిశోధన చేయరాదు. ఉద్యోగంలో చేరే సమయంలో హెచ్‌ఐవీ ఉన్నదో.. లేదో తెలుపాల్సిన అవసరం లేదు. 18 ఏండ్లలోపున్న హెచ్‌ఐవీ రోగులు తమ ఇంట్లో ఉండొచ్చు, వారికి ఆస్తిలో వాటా ఉంటుంది. ఇక హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థుల వివరాలను, వారితో కలిసి ఉండేవారి సమాచారాన్ని ప్రచురించినా, వారిని దూషించినా, వారికి వ్యతిరేకంగా ప్రచారం చేసినా గరిష్ఠంగా రెండేండ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. హెచ్‌ఐవీ రోగుల ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక అంబుడ్స్‌మెన్‌ను నియమించాల్సి ఉంటుంది.

Related Stories: