అటెండెన్స్ తక్కువగా ఉందని ఆత్మహత్య

చెన్నై: అటెండెన్స్ తక్కువగా ఉందని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులోని చెన్నైలో ఇవాళ చోటుచేసుకుంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ-మద్రాస్‌లో ఈ దారుణం జరగడం కలకలం రేపుతోంది. మృతుడు ఓషియన్ ఇంజినీరింగ్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్న కేరళకు చెందిన షాహల్ కోర్‌మాత్(23)గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. హాజరు శాతం తక్కువ ఉన్నందున ఫైనల్ ఇయర్ పరీక్షలకు తనను అనుమతించరని భయపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తెలిపారు. అటెండెన్స్ తక్కువ ఉండటంపై కొద్ది రోజుల క్రితం విద్యార్థి తల్లిదండ్రులకు కళాశాల అడ్మినిస్ట్రేషన్ అధికారులు సమాచారం అందించారు. శనివారం ఉదయం షాహల్ స్నేహితుడు ఒకరు తనును కలిసేందుకు వెళ్లాడు. అతడు ఉంటున్న గది తలుపులను తీయాలని చేతితో ఎంత కొట్టినా అవతలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనుమానం రావడంతో హాస్టల్ వార్డెన్ రఘురామ్ రెడ్డికి సమాచారం అందించడంతో అతడు కొట్టూర్‌పురం పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్లి చూసే సరికి షాహల్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ జరపుతున్నారు. షాహల్ గది నుంచి ఎలాంటి సూసైట్ లెటర్ లభించలేదని పోలీసులు వెల్లడించారు.

Related Stories: