దీపక్ కొచ్చర్‌కు కార్పొరేట్ శాఖ సమన్లు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఐసీఐసీఐ బ్యాంక్ వివాదంలో దీపక్ కొచ్చర్‌కు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. బ్యాంక్ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ భర్త అయిన దీపక్‌ను ఈ నెలాఖర్లో ప్రశ్నించే వీలుందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. దీపక్ కొచ్చర్.. నూపవర్ గ్రూప్ వ్యవస్థాపక సీఈవో అన్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 23న ఐసీఐసీఐ బ్యాంక్ వివాదంతో సంబంధమున్న ఆరు సంస్థల్లో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తనిఖీలకు ఆదేశించింది. వీటిలో నూపవర్ రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుప్రీం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, పసిఫిక్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నూపవర్ విండ్ ఫార్మ్స్ లిమిటెడ్, చందఉర్జా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలున్నాయి.