గెలుపుతో ప్రారంభించాలని..

virat
- కివీస్‌తో భారత్ వామప్ మ్యాచ్ నేడు - విజయ్ శంకర్‌కు గాయం
లండన్: కోట్లాది మంది అభిమానుల ఆశలను మోసుకుంటూ ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన భారత క్రికెట్ జట్టు విశ్వసమరానికి ముందు శనివారం న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ బరిలో దిగనుంది. ఇప్పటికే జట్టులోని అన్ని స్థానాలకు సరైన ఆటగాళ్లు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో డైలమాలో ఉన్న నాలుగో నంబర్ ఆటగాడిగా ఎవరిపై నమ్మకముంచాలో ఈ మ్యాచ్‌తో ఓ స్పష్టత రానుంది. ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంగా ఉన్నా అంటున్న లోకేశ్ రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడిస్తారా.. లేక రిజర్వ్ ఓపెనర్‌గానే భావించి విజయ్ శంకర్‌కు అవకాశం ఇస్తారా చూడాలి. అయితే నెట్స్‌లో ప్రాక్టీస్ సందర్భంగా శంకర్ కుడిచేతికి గాయమైనట్లు సమాచారం. అతడు కివీస్‌తో మ్యాచ్‌లో బరిలో దిగుతాడా లేదా అనేదానిపై స్పష్ఠత రావాల్సి ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో మొత్తం 15 మందికి ఆడే చాన్సుంటుంది కాబట్టి వచ్చే నెల 5న సౌతాంప్టన్‌లో దక్షణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనున్న టీమ్ ఇండియా అస్త్రశస్ర్తాలను సరిచూసుకునేందుకు ఈ మ్యాచ్‌ను వినియోగించుకోవాలని భావిస్తున్నది. టోర్నీ ఎలాంటిదైన పర్యటనలో శుభారంభం దక్కడం ముఖ్యమనేది అందరిమాట. దాదాపు 50 రోజుల పాటు సాగనున్న ఈ మెగాటోర్నీలో ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే గెలిచి టీమ్‌ఇండియా సానుకూలంగా కప్పువేట మొదలెడుతుందా చూడాలి.

ఐపీఎల్ నుంచి వన్డేల్లోకి

సుదీర్ఘ ఐపీఎల్ సీజన్‌లో దుమ్మురేపిన మనవాళ్లు పొట్టి ఫార్మాట్ నుంచి 50 ఓవర్లకు అలవాటు అయ్యేందుకు ఈ మ్యాచ్ ఉపకరించనుంది. ఈసారి ఇంగ్లండ్ పిచ్‌లు సీమ్‌కు పెద్దగా సహకరించవనే వాదనల మధ్య కప్పు కోసం ఎన్నోఏండ్లుగా తహతహలాడుతున్న న్యూజిలాండ్‌తో కోహ్లీసేన తలపడనుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్‌తో పాటు వన్‌డౌన్‌లో కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఆ తర్వాత రాహుల్, జాదవ్, ధోనీ, కార్తీక్, పాండ్యా, జడేజా, విజయ్ శంకర్‌తో బ్యాటింగ్ పటిష్ఠంగా ఉంది. బుమ్రా, భువనేశ్వర్, షమీలతో పేస్ దళం అదరగొట్టేందుకు సిద్ధంగా ఉంటే.. మణికట్టు మాయగాళ్లు కుల్దీప్, చహల్ సత్తాచాటేందుకు రెడీగా ఉన్నారు.