‘రాఫెల్’ రాకకు సన్నాహాలు!

-ఏర్పాట్లు చేస్తున్న వైమానిక దళం -ఫ్రాన్స్‌లో ఒక దఫా శిక్షణ పూర్తిచేసుకున్న పైలెట్ల బృందం -అవినీతి ఆరోపణలను పట్టించుకోని కేంద్రం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను పట్టిచుకోని కేంద్రం.. నిర్ణీత గడువులోపు విమానాలు భారత్‌కు రానుండటంతో అందుకు తగిన ఏర్పాట్లను పూర్తిచేస్తున్నది. యుద్ధవిమానాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలతోపాటు పైలెట్ల శిక్షణ, రాఫెల్ ఫైటర్ జెట్లకు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటి నుంచే వైమానిక దళం సన్నాహాలు చేస్తున్నదని అధికారవర్గాలు వెల్లడించాయి. రాఫెల్ జెట్లను నడిపేందుకు కావాల్సిన శిక్షణలో భాగంగా ఫ్రాన్స్‌లో ఇప్పటికే ఒక దఫా శిక్షణను పొందిన పైలెట్ల బృందం.. ఈ ఏడాది చివరినాటికి మరోసారి అక్కడికి వెళ్లనున్నది.

36 రాఫెల్ యుద్ధవిమానాల సరఫరా కోసం 2016లో ఫ్రాన్స్‌తో భారత్ రూ.58 వేల కోట్ల విలువైన ఒప్పందం చేసుకున్నది. 2019 సెప్టెంబర్ నుంచి ఈ యుద్ధవిమానాల అప్పగింత ప్రారంభమవుతుంది. కాగా ఉత్పత్తి సంస్థ దస్సాల్ట్ ఏవియేషన్ ఇప్పటికే రాఫెల్ విమానాల టెస్ట్‌డ్రైవ్‌ను ప్రారంభించిందని.. గడువులోపు విమానాలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆ సంస్థ స్పష్టంచేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్‌కు కావాల్సిన విధంగా పలు ప్రత్యేక మార్పులతో యుద్ధవిమానాలను దస్సాల్ట్ ఏవియేషన్ సరఫరా చేయనున్నది. ఇందులో ఇజ్రాయిలీ హెల్మెట్-మౌంటెడ్ డిస్‌ప్లే, రాడార్ హెచ్చరికల రిసీవర్లు, లోబాండ్ జామర్లు, 10 గంటల విమానాల డేటా రికార్డింగ్, ఇన్‌ఫ్రారెడ్ సర్చ్, ట్రాకింగ్ సిస్టం వంటివి ఉన్నాయి.

అంబాలాలో మొదటి స్కాడ్రన్..

రాఫెల్ యుద్ధవిమానాలతో కూడిన మొదటి స్కాడ్రన్ (యూనిట్)ను భారత్-పాక్ సరిహద్దుకు 220 కిలోమీటర్ల దూరంలోని వ్యూహాత్మక ప్రాంతం అంబాలాలో ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పశ్చిమబెంగాల్‌లోని హసిమారా బేస్‌లో రెండో రాఫెల్ స్కాడ్రన్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో షెల్టర్లు, హ్యాంగర్ల నిర్మాణం, నిర్వహణ సదుపాయాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.400 కోట్లను విడుదల చేసిందని సమాచారం.

Related Stories: