మాల్యాను ఉంచే జైలు వీడియో ఇవ్వండి!

లండన్: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కేసును ఇవాళ యూకేలోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు విచారించింది. మాల్యాను ఉంచబోయే జైలు వీడియో ఇవ్వాలని భారత్‌ను అక్కడి కోర్టు ఆదేశించింది. మనీ లాండరింగ్, మోసం అభియోగాలను ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలని వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరుపుతున్నది. ఈ సందర్భంగా భారత అధికారులు సమర్పించిన జైలు ఫొటోలను చూసి తాను నిర్ణయం తీసుకోలేనని జడ్జి ఎమ్మా ఆర్బత్‌నాట్ స్పష్టంచేశారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న డోర్ నుంచి లోనికి వెళ్లి అక్కడి పరిస్థితులను మొత్తం వీడియో తీయాలని ఆమె స్పష్టంచేశారు.

మధ్యాహ్నం సమయంలో వీడియో తీయండి. సెల్‌లోకి వెలుతురు, గాలి సరిగా వచ్చే వీలుందో లేదో చూడాలి అని జడ్జి చెప్పారు. ఇండియాలో జైళ్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మాల్యా వాదిస్తున్నాడు. గత ఏప్రిల్‌లో ఈ కేసుకు సంబంధించి యూకే పోలీసులు మాల్యాను అరెస్ట్ చేయగా.. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. అతని వాదన మేరకు మాల్యాను ఉంచబోయే జైలు వీడియోను చూపించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. మంగళవారం జరిగిన విచారణకు తనయుడు సిద్దార్థ్‌తో కలిసి మాల్యా కోర్టుకు వచ్చారు. దీనిపై కోర్టే తుది నిర్ణయం తీసుకుంటుంది అని కోర్టు బయట ఉన్న మీడియాతో మాల్యా అన్నాడు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. తానేమీ క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోలేదని, బాకీ మొత్తం తీర్చేస్తానని స్పష్టంచేశాడు.

Related Stories: