ఇమ్రాన్ ఆహ్వానం రాలేదు.. పాకిస్థాన్ వెళ్లను!

ముంబై: పాకిస్థాన్ ప్రధానిగా ఈ నెల 11న ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే కదా. తన ప్రమాణ స్వీకారానికి ఇండియా నుంచి చాలా మంది ప్రముఖులను ఇమ్రాన్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో చాలా వరకు మాజీ క్రికెటర్లు ఉన్నారు. గవాస్కర్, కపిల్ దేవ్, సిద్ధూలాంటి క్రికెటర్లను ఇమ్రాన్ ఆహ్వానించారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్‌ఖాన్‌కు కూడా ఆహ్వానం అందిందని, అతడు పాకిస్థాన్ వెళ్తున్నాడన్న వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఆమిర్ స్పందించాడు. నేను పాకిస్థాన్ వెళ్లడం లేదు. నాకు ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం ఆహ్వానం అందలేదు అని స్పష్టంచేశాడు. అదే సమయానికి ఆమిర్ తన చారిటీ ఫౌండేషన్ పనిలో బిజీగా ఉండనున్నాడు.

ఆగస్ట్ 12న తన పానీ ఫౌండేషన్‌లో ఓ పెద్ద ఈవెంట్ జరగనున్నట్లు చెప్పాడు. ఆ ఈవెంట్ కోసం నేను సిద్ధమవుతున్నాను. పది వేల మంది గ్రామస్థులు అందులో పాల్గొననున్నారు అని ఆమిర్‌ఖాన్ చెప్పాడు. 65 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ పార్టీ పాక్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేకపోవడంతో చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆహ్వానం పంపే ఆలోచనలో ఉన్నట్లు ఇమ్రాన్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

× RELATED 16 మంది సీఎంలు పాలించినా అభివృద్ధి శూన్యం